
భద్రాచలం, జనవరి 29: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బహుళ ద్వాదశి రోజున భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశ్వరూప సేవ జరపడం ఆచారం. ఆలయంలో చేసే పూజల్లో దోషాలు, లోటుపాట్ల వంటివి ఏమైనా ఉంటే వాటి ప్రాయశ్చిత్తం కోసం ఉప ఆలయాల్లో పూజలు అందుకునే 108 అర్చనా మూర్తులను ఒకే చోటకు చేర్చి వారందరికీ ఏక కాలంలో పూజలు జరపడం ఈ విశ్వరూప సేవలోని విశిష్టత. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని వీక్షించలేనివారు, ముక్కోటి దేవతలు కొలువైన విశ్వరూప సేవ రోజున దర్శించుకుంటే పాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం. బేడా మండపంలో నిర్వహించిన విశ్వరూప సేవ వైకుంఠాన్ని తలపించింది. చుట్టూ 108 మంది దేవతలు, వారి మధ్యలో వైకుంఠ రాముడు కొలువుదీరాడు.
రామయ్య సేవలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
భద్రాచలం, జనవరి 29: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ శనివారం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో బానోత్ శివాజీ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.