e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 24, 2022
Home ఖమ్మం ‘జన మంగళం’ జయం.. జయం

‘జన మంగళం’ జయం.. జయం

ప్రజల సేవకు కదిలిన ‘జన మంగళం’ ట్రస్ట్‌
నారాయణపురంలో 20 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ‘సాయి’ మందిరం
రూ.100 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి
నేడు అతిథుల చేతుల మీదుగా శంకుస్థాపన

సత్తుపల్లి, నవంబర్‌ 28: సత్తుపల్లి మండలంలో ఒక చిన్న పల్లె నారాయణపురం. గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతూనే మరో అంశంలో ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘శ్రీషిరిడీ సాయి జనమంగళం’ అనే ట్రస్ట్‌ గ్రామంలో చేపడుతున్న నిర్మాణాలే అందుకు కారణం. ట్రస్ట్‌ నిర్వాహకులు నిరుపేదలకు అత్యాధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో రూ.100 కోట్లతో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, గ్రామస్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు షిరిడీసాయి మందిరం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ప్రస్తుతం 20 ఎకరాల విస్తీర్ణంలో మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సువిశాలమైన గార్డెనింగ్‌, ఆహ్లాదకర ప్రదేశం, సర్వాంగ సుందరంగా మందిరం రూపుదిద్దుకుంటున్నది. ట్రస్ట్‌ నిర్వాహకులు ఆస్పత్రి నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.
ప్రజారోగ్య సంరక్షణే ట్రస్ట్‌ ధ్యేయం..
నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించే లక్ష్యంతో శ్రీషిరిడీసాయి జన మంగళం ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ చంద్రభాను సత్పతి ఆధ్వర్యంలో ట్రస్ట్‌ ప్రతినిధులు ఆస్పత్రి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు చివరి అంకానికి చేరుకోగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి సత్వరం పూర్తి చేయనున్నారు. ఆసుపత్రి నిర్మాణం తర్వాత నర్సింగ్‌ కళాశాలనూ ఏర్పాటు చేసి 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో 250 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రానున్నది.
గ్రామస్తుల సహకారం..
గ్రామంలో ఆసుపత్రి, సాయి మందిర నిర్మాణానికి గ్రామస్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ట్రస్ట్‌ అందరూ ఏకతాటి పైకి వచ్చి రూ.8 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని ఉదారంగా అందించారు. భూమిని ట్రస్ట్‌ పేరుపై రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. గ్రామంలో ఆసుపత్రి తమ గ్రామం గ్లోబల్‌ విలేజ్‌గా మారుతుందని, ఎందరో నిరుపేదలకు ఉచిత వైద్యం అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే సండ్ర ప్రత్యేక చొరవ..
మందిరం, ఆసుపత్రి నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రస్టు నిర్వాహకులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన మట్టి తోలకాలు, విద్యుత్‌ సౌకర్యాలను కల్పించారు. రేజర్ల, తాళ్లమడ నుంచి నారాయణపురం గ్రామానికి వెళ్లేందుకు వీలుగా బీటీ రోడ్లు మంజూరు చేయించారు. త్వరలోనే వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాళ్లమడ నుంచి ఆసుపత్రి, మందిరానికి వెళ్లేలా బైపాస్‌ రోడ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నేడు ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన..ట్రస్ట్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు 250 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, ట్రస్ట్‌ ఫౌండర్‌ చంద్రభాను సత్పతి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ట్రస్టు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆలయ నమూనాను ఆవిష్కరించారు.

ఉచితంగా ఆధునిక వైద్యం..
మాది చిన్న పంచాయతీ. అయినా మేం ఎందులోనూ తక్కువ కాదు. జనమంగళం ట్రస్ట్‌ గ్రామంలో 250 పడకల ఆసుపత్రి నిర్మించడానికి ముందుకు వచ్చింది. షిరిడీ సాయి మందిరం నిర్మిస్తున్నది. ఆస్పత్రి ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యం అందనున్నది. ఆలయం ఏర్పాటుతో గ్రామస్తుల్లో భక్తిభావం ఏర్పడనున్నది. నిర్మాణానికి ముందుకు వచ్చిన ట్రస్ట్‌ వారికి ధన్యవాదాలు.

  • దేశిరెడ్డి రంగారెడ్డి, సర్పంచ్‌, నారాయణపురం
- Advertisement -

గ్లోబల్‌ విలేజ్‌గా గ్రామం..
ట్రస్టు ఆధ్వర్యంలో అందుబాటులోకి రానున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీషిరిడీసాయి మందిరతో మా గ్రామం గ్లోబల్‌ విలేజ్‌గా మారనుంది. గ్రామానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు రానున్నది. ట్రస్ట్‌ ద్వారా సుమారు 12 వేల మందికి పైగా ఉపాధి దొరకనున్నది. ఆస్పత్రి ద్వారా మన రాష్ట్ర ప్రజలకే కాక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకూ వైద్య సేవలు అందనున్నాయి.

  • శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement