
మున్సిపాలిటీల్లో టీఎస్-బీపాస్‌తో తొలగిన ఇబ్బందులు
కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్లైన్లో ఆమోదం
21 రోజుల్లోనే అనుమతి పొందే అవకాశం
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 27 : భవన నిర్మాణాల అనుమతుల్లో అవినీతికి చెక్ పెట్టి.. పారదర్శంగా సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్-బీపాస్ ప్రవేశపెట్టింది. ఇండ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకునే యజమానులకు 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందేలా బీ-పాస్‌ను రూపొందించింది. అంతేకాదు, 75 గజాల నుంచి 200 చదరపు గజాల్లో జీ ప్లస్ ఇంటికి ప్లాన్ లేకుండానే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఒక రూపాయితో ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేలా రూపకల్పన చేసింది. దీని ద్వారా ఇంటి నిర్మాణ అనుమతులు సులభతరం కావడంతోపాటు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతున్నది.
భవన నిర్మాణాల అనుమతుల్లో ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్- బీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మీషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్)కు అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త మున్సిపల్ చట్టం-2019 తీసుకొచ్చి నవంబర్ 16వతేదీన ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో యజమానులు ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకోవడం సులభం అవుతున్నది.
21 రోజుల్లో అనుమతులు..
ఇండ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకునే యజమానులకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం 21రోజుల సమయం కేటాయించింది. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఆన్లైన్లో స్వీయ ధ్రువీకరణతో అనుమతులు ఇచ్చేలా బీ-పాస్‌ను రూపొందించింది. 75 గజాల నుంచి 200చదరపు గజాల్లో జీ ప్లస్ ఇంటికి ప్లాన్ లేకుండానే నిర్మాణాల అనుమతి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఒక రూపాయితో వెంటనే ఆన్లైన్లో అనుమతులు ఇచ్చేలా రూపకల్పన చేసింది. 200 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు గల ప్లాట్లలో జీ ప్లస్ టు అంతస్తుల వరకు అనుమతులు ఇవ్వడంతోపాటు స్వాధీన ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ఏరియా, స్థల విస్తీర్ణాన్ని బట్టి, మార్కెట్ వాల్యూ ప్రకారం తొలుత సాధారణ ఫీజును ఆ తర్వాత అనుమతి వచ్చాక 14 రోజుల అనంతరం 21 రోజులలోపు మిగతా ఫీజును చెల్లించి భవనాలు నిర్మించుకోవచ్చు.
నూతనంగా ఇంటిని నిర్మించుకునేవారు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగకుండానే తమ వద్ద ఉన్న రిజిస్టర్ డాక్యుమెంట్లతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 21రోజుల్లోనే అనుమతిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ భూములు ఉండడంతో నిర్మాణాలకు అనుమతులను తీసుకుంటున్నారు. ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలు ఏజెన్సీ ప్రాంతం కావడం, రిజిస్ట్రేషన్ భూములు లేకపోవడంతో అనుమతులు తీసుకునేందుకు దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు కొత్తగూడెంలో 65 దరఖాస్తులు రాగా 48 దరఖాస్తులకు అనుమతినిచ్చారు. 14 తిరస్కరించగా, మరో 3 దరఖాస్తులు అనుమతులకు సిద్ధంగా ఉన్నాయి. పాల్వంచ మున్సిపాలిటీలో 109 దరఖాస్తులు రాగా 90 అనుమతినిచ్చారు. 13 దరఖాస్తులు తిరస్కరించారు. 6 కొత్త ఫైల్స్ అనుమతులకు సిద్ధంగా ఉన్నాయి.
ఇలా దరఖాస్తు
టీఎస్-బీపాస్ పోర్టల్‌లోకి వెళ్లి రిజిస్టర్ ధ్రువపత్రాలను, ప్లాన్‌ను ఆన్లైన్ చేస్తే, అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉంటే 21రోజుల్లోనే అనుమతులిస్తారు. ఈ విధానంతో ఇంటి యజమానులకు సులువు అవుతున్నది. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో
సంప్రదించవచ్చు.
-అరిగెల సంపత్‌కుమార్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్
ఆకస్మిక తనిఖీలు చేసే అధికారం..
టీఎస్-బీపాస్ విధానంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానా విధిస్తారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ (స్వీయ ధ్రువీకరణ) ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే యజమానులకు ఎటువంటి ఇబ్బందులుండవు. అనుమతులు ఇచ్చిన తర్వాత మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫైర్‌శాఖల అధికారులు ఎన్ఫోర్స్మెంట్ టీం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తారు. దరఖాస్తుదారు సమర్పించిన ధ్రువపత్రాలు, భవన నిర్మాణ స్థలంలో తేడాలు ఉంటే ఎన్ఫోర్స్మెంట్ టీం సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి 25 శాతం అదనంగా జరిమానాలు విధించడం లేదా ముందస్తుగా సమాచారం ఇచ్చి నిర్మాణాన్ని కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.