
పశు, పక్షిజాతులకు వరం
మత్స్య సంపదకు నిలయం
మనిషి బతుకుతో ఆద్యాంతం చెలిమి
చెరువు గొప్పతనంపై ప్రత్యేక కథనం
ఇల్లెందు, నవంబర్ 20: చెరువు గట్టు మీద నుంచి చూస్తే ఒకవైపు ఊరు.. మరోవైపు పచ్చని పంట పొలాలు. అక్కడే పక్షుల కిలకిలలు, వానరుల కిచకిచలు. సాయంత్రం వేళ పశు, పక్షిజాతుల సయ్యాటలు. గిజిగాడి గూళ్లు నీటి మీద వాలి చూడముచ్చటగా ఉంటాయి. సాకిరేవుల దగ్గర సందడే సందడి. ఆడపడుచులంతా పండుగల గురించి మాట్లాడుకుంటూ పుట్టింటి వారిపై పొగడ్తలు గుప్పిస్తుంటారు. ఒక్కటి కాదు.. రెండు కాదు ముచ్చటే ముచ్చట్లు. గట్టు పక్కన పంట పొలాల్లో పాటలు, కవితలు, సామెతలతో మహిళల సందడి కనిపిస్తుంది.
గంగే గౌరమ్మ
తెలంగాణలో బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. ప్రతి మహిళా బతుకమ్మను ఆడుతూ గంగ, గౌరమ్మలను పూజిస్తుంటారు. నూటొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి సింగిడి వర్ణాలతో అలంకరించి చప్పట్లు కొడుతూ బతుకమ్మను ఆరాధిస్తుంటారు. అలా తొమ్మిది రోజులు బతుకమ్మ, గౌరమ్మలకు పూజలు చేసి గంగమ్మ ఒడిలో నింపుతారు. ఆ గంగమ్మ గౌరమ్మను తన పుట్టింటికి వచ్చిందనే సంతోషంతో పరవశించిపోతుంటుంది. ఏడాది పొడవునా పంటలకు నీరందించేందుకు తన శాయశక్తులా గంగమ్మ కృషి చేస్తుంటుంది. అలా ప్రతి ఏడాది బతుకమ్మలతో గంగమ్మ పరవశించి పోతూ తన ఒడి నింపుకుంటుంది. ఆ అక్కాచెల్లెళ్ల అనుబంధమే మానవ సంప్రదాయంగా కొనసాగుతున్నది. ఇప్పటికీ అన్నదమ్ములు కలిసి ఉండరేమోకాని, అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం ఎప్పటికీ తెగిపోదు. అదే గంగమ్మ, గౌరమ్మల ప్రత్యేకత. ఇలా ఊరి చెరువు బతుకమ్మలతో పూలవర్ణంగా మారుతుంటుంది. మహిళలంతా సంతోషంగా గంగమ్మ ఒడి నింపడం ప్రత్యేకత.
అడుగంటినా ఆసరే..
ఊరి చెరువు వేసవిలో అడుగంటడం సర్వసాధారణం. అడుగంటేటప్పుడు చెరువు ఆసరా అవుతుంది. పశుపక్షిజాతులకు దాహం తీరుస్తుంది. చెరువు గట్టుమీదున్న వానరులకు దప్పిక తీరుస్తుంది. చెరువులో ఉండే వివిధ రకాల బుడ్డపరకలకు సైతం చినుకు పడే దాక ఆశ్రయం కల్పిస్తుంది. అడుగంటితేనేం ఊరికి అండగా నిలబడుతానంటూ చెరువు ముందుకొస్తుంది. తీవ్ర వేసవిలో సైతం చెరువు అడుగంటినప్పటికి గట్టుమీద కూర్చొని సంధ్యావేళలో చెరువు వైపు చూస్తే ఆ చల్లని గాలులు మనసుకు హాయిని గొల్పుతుంది. ఆహ్లాదాన్ని మైమరిపిస్తుంటుంది. అలసిన మనసుకు ఆ ఆహ్లాదం ఊరటను కల్పిస్తుంటుంది. అడుగంటినా అధైర్యపడొద్దు అంటూ భరోసాను కల్పిస్తుంది. తొలకరి వస్తుంది నాలో గంగమ్మను నింపుకుంటానంటూ ఊరికి అభయమిస్తుంది.
చెరువు.. మా ఊరి ఆదెరువు. ప్రకృతి సౌందర్యం, పశు, పక్షిజాతులకు వరం. మనిషికి జీవనాధారం. చెరువు లేనిదే జీవన మనుగడ అసాధ్యం. చెరువుతో మనిషి బతుకు ముడిపడి ఉంది. అలాంటి చెరువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొచ్చింది. గొలుసుకట్టు చెరువులకు తెలంగాణలో పెట్టింది పేరు. ఒకదాని వెనుక ఒకటి వరుసగా చూడముచ్చటగా ఉంటాయి. ఏడాది పొడవునా చెరువు కింద పచ్చని పొలాలు కనువిందు చేస్తుంటాయి. అటువంటి చెరువును ఒక్కసారి గుర్తు చేసుకుందాం. దాని గొప్పతనాన్ని నిశితంగా పరిశీలిద్దాం. – ఇల్లెందు, నవంబర్ 15
మైమరిపించే మట్టివాసన
గట్టుకింద పంట పొలాల్లో మట్టి వాసన మనసును పరిమళింపజేస్తుంది. తొలకరి చినుకు మట్టిలో పడితే ఆ మట్టి నుంచి వచ్చే వాసన ఎలా ఉంటుందో.. పుడమితల్లి ఒడిలో వేసిన పంటలో అదే వాసన వస్తుంది. ఆ వాసనతో రైతులు ఆరోగ్యంగా జీవిస్తుంటారు. నాటు వేసే మహిళలు నిరంతరం బురదలో దిగుతూ నాట్లు వేస్తూ మట్టివాసనను ఆస్వాదిస్తూ ఉంటారు. మట్టి వాసనతోనే పాట పుట్టిందని నానుడి. ఆ పాటలు మహిళల ద్వారా జానపద గేయాలుగా మారాయి. ఆ జానపద గేయాలే ఇప్పుడు మాస్, బీట్ సాంగ్లుగా సినీ పరిశ్రమలో ఉర్రూతలూగిస్తున్నాయి. నాటేస్తున్నప్పుడు, వరి కొస్తున్నప్పుడు, కలుపు తీస్తున్నప్పుడు మహిళల నుంచి ఉత్పన్నమయ్యే పాటలు వెలకట్టలేనివి. ఆ రాగాలు చెరువు నుంచి వెలువడినవే. రైతన్న గోడు, పంట మొదలు దగ్గరికి తెచ్చిన కాడి నుంచి పంట కుప్ప కొట్టేటప్పుడు రైతులు ఏకమై వేకువజామున వెళ్లి.. నిద్రను పారద్రోలేందుకు పాటలు పాడుతూ పంట నూర్పిడి చేస్తుంటారు. ఆ పసందే వేరు.
చెరువు ఒక చెలిమి
పట్నాల్లో చదివే విద్యార్థులు సెలవులకు ఇంటికొచ్చారంటే సరదాగా చెరువు గట్టుమీద సేదతీరుతారు. సంధ్యాసమయాల్లో ఎర్రగా పొద్దువాలుతుంటే తాజా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు. అలసిన మనసుకు చెరువు స్నేహితుడిలా పరిచయమవుతుంది. ఎంచక్కా గట్టుమీద కూర్చొని గులకరాళ్లను చెరువులో వేస్తూ ఆహ్లాదంలో తేలిపోతుంటారు. నీటిలో పడే గులకరాళ్ల శబ్ధం మనుసును పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. చెరువుతో చెలిమి చేసేవారు చాలామంది. గుంపులుగుంపులుగా వెళ్లి స్నేహితులు స్నానాలు చేస్తూ సరదాగా గడుపుతూ ఉంటారు. గట్టు మీద రకరకాల చెట్లు కనువిందు చేస్తుంటాయి. గట్టు నడుమ గుడి దర్శనమిస్తుంటుంది. గుడిపక్కన చింత, మర్రిచెట్టు గుబురుగా విస్తరించి ఉంటుంది. చక్కని నీడ పరిచి వచ్చిపోయే వారందరికి ఆశ్రయం కల్పిస్తుంది. ఎండకు నీడలా, వర్షానికి గొడుగులా, చలికి దివిటిలా అండగా ఉంటుంది. గుడిలో ఉన్న ముత్యాలమ్మ తల్లి పంట పొలాలను కాపాడుతూ గంగమ్మ చెంత కాపలా కాస్తుంటుంది. గట్టు కింది భాగానా వనంలా ఉన్న చెట్లపై రకరకాల పక్షులు కేరింతలు కొడుతుంటాయి. వాటిలో గిజిగాళ్లకు ప్రత్యేకత ఉంటుంది. చెరువు అంచు భాగాన నీటిపై తేలేటట్టు గూళ్లు నిర్మిస్తుంటాయి. ఆ గూళ్లు మానవ ఊహకందని విధంగా ఉండడం విశేషం. ఏదేమైనా చెరువు ఓ ప్రత్యేకత. ఒక చెలిమి. చెరువు లేనిది ఊరు మనుగడ సాగదు. చెరువులు ఏడాది పొడవునా నీరుంటే ఆ ఊరంతా పచ్చగా ఉంటుంది. రకరకాల పంటలు, పాడితో గ్రామమంతా అభివృద్ధిలో పయనిస్తుంది. రైతన్నలంతా సుఖసంతోషాలతో ఉంటారు.