
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషిచేస్తా
నా విజయానికి కృషిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
‘నమస్తే’తో ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్
ఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాప్రతినిధిగా జిల్లా ప్రజల గొంతుకను మండలిలో వినిపించి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేయడమే తన లక్ష్యమని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ అందించిన అవకాశం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణుల కృషి వల్లనే తాను విజయం సాధించానని అన్నారు. తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, వారి ప్రతి అవసరంలోనూ తాను భాగస్వామినవుతానని అన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తాతా మధుసూదన్ మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ: ఎమ్మెల్సీగా మీ ప్రాధాన్య అంశాలేమిటి?
తాతా మధు: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విస్తరించి ఉన్న ఖమ్మం శాసనమండలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలపై ఇప్పటికే నాకు అవగాహన ఉంది. వారికి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత, ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన అవసరం నాపై ఉన్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పంచాయతీ కార్యాలయాల్లో ఎంపీటీసీలకు ప్రత్యేక స్థానం కల్పించడం, గౌరవ వేతనం పెంచడం, వారికి ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు కేటాయించడం వంటి అంశాలను శాసనమండలిలో ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ప్రజాప్రతినిధుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు శాసనమండలిలో ప్రస్తావిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయడమే నా ప్రాధాన్య అంశం.
నమస్తే: ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలేంటి?
తాతా మధు: ఖమ్మం జిల్లా వ్యక్తిగా ఇక్కడి ప్రజల అవసరాలు, ఇబ్బందులు, ప్రజాప్రతినిధుల సమస్యలు నాకు తెలుసు. ఈ మేరకు వాటి పరిష్కారం కోసం పూర్తి అవగాహనతోనే హామీ ఇచ్చాను. ఈ విజయావకాశంతో ప్రతి సమస్య పరిష్కారానికీ కృషిచేస్తా. అందరితో సమన్వయంగా వ్యవహరించి గులాబీ జెండా గౌరవాన్ని పెంపొందిస్తా.
నమస్తే: పోటీచేసినప్పుడు ఎలా భావించారు?
తాతా మధు: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీచేయాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించగానే ఆనందించా. టీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ ఉండడంతో ఏకగ్రీవమయ్యే అవకాశం లభిస్తుందనుకున్నాం. అయితే ఎన్నికల్లో గెలిచే బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పోటీచేయడం ద్వారా ఓటర్లను గందరగోళపరిచేందుకు రాజకీయ కుట్రలకు తెరలేపింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. దీనికితోడు మరో ఇద్దరు స్వతంత్రులు పోటీచేసినా తొలి ప్రాధాన్య ఓట్లలోనే ఓటర్లు నాకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సత్తాకు ఇది నిదర్శనం.