ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో పేదలను వంచించే హామీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆసరా పింఛన్దారుల ఓట్లను కొల్లగొట్టేందుకు పచ్చి మోసపూరిత హామీలను ఇచ్చి.. గద్దెనెక్కినంక రిక్తహస్తం చూపించింది. ఎన్నికల సమయంలో ఆసరా పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు, హెచ్ఐవీ, డయాలసిస్ రోగులకు రూ.4,000 పింఛన్లు, దివ్యాంగులకు రూ.6,000 పింఛన్లు అందిస్తామని కపటనాటకం ఆడింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 13 నెలలు ముగిసినప్పటికీ పింఛన్ల పెంపు ఊసే ఎత్తడం లేదు. ఇక కొత్తగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారి పరిస్థితి ఎడారి కథే అవుతున్నది.
– మామిళ్లగూడెం, జనవరి 9
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదల అభివృద్ధికి పెద్దపీట వేశారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లు పాలకులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు పేదలను పట్టించుకున్న పాపానపోలేదు. బీఆర్ఎస్ పార్టీ వారిని అక్కున చేర్చుకుని ‘ఆసరా’గా నిలిచింది. నాడు రాజకీయ అండదండలు, ముడుపులు చెల్లించిన వారికే పింఛన్ అన్నవిధంగా పేదల పట్ల కాంగ్రెస్, టీడీపీలు వ్యవహరించాయి. కొత్త రాష్ట్రంలో నిరుపేదల పింఛన్ కష్టాలను తీర్చాలన్న తలంపుతో నాటి సీఎం కేసీఆర్ ఆసరా పథకానికి రూపకల్పన చేశారు.
అంగవైకల్యం ఉన్నవారికి సంఘ సేవకుడిగా.. వృద్ధులకు బాధ్యత గల పెద్దకొడుకుగా.. వితంతువులు, ఒంటరి మహిళలకు ఓదార్పునిచ్చే అన్నగా.. చేనేత, గీత కార్మికుల కష్టాలు తెలిసిన కార్మికుడిగా.. బోదకాలు, ఎయిడ్స్ రోగులకు చేయూతనిచ్చే స్నేహితుడిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పథకాన్ని 2014 అక్టోబర్ నుంచి అమలు చేశారు. నిరుపేదల సంక్షేమం, సాంఘిక భద్రత కల్పించడంలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవ్వగా.. వారికి కొండంత అండగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నాడు కాంగ్రెస్ అందించిన రూ.200 పింఛన్ కనీసం మందుబిల్లలకు కూడా సరిపోయేదికాదు. పెరుగుతున్న ధరలు, క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసిన నాటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం నెలరోజులపాటు ఒక్క పూటన్న కడుపు నిండా భోజనం చేయాలన్న దృక్పథంతో రూ.200, రూ.500 ఉన్న పింఛన్లను ఏకంగా రూ.2,000, రూ.4,000 వరకు పెంచారు.
బీఆర్ఎస్ హయాంలో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా పింఛన్లు అందించింది. ఎప్పటికప్పుడు అర్హులను గుర్తించి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడి, అశ్రద్ధ లేకుండా అవినీతిరహితంగా నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసి ఆదుకున్నారు. నేటికీ బీఆర్ఎస్ సర్కార్ మంజూరు చేసిన పింఛన్లే కొనసాగుతున్నాయి.
కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 13 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ నేటికి ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. అధికారం చేపట్టిన వెంటనే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించి వాటిని మూటకట్టి అటకెక్కించారు. అయినా ప్రజలు ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండలస్థాయిలో జరిగే ప్రజావాణిలో పింఛన్ల కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొత్త పింఛన్ల కోసం 14,652 మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ వాటి ఊసే ఎత్తడం లేదు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉండేదో నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పరిస్థితీ అలాగే కనిపిస్తున్నది.
దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి..
జిల్లాలో ప్రతి నెలా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీలో కమిషనర్లు ఆయా దరఖాస్తులను పరిశీలించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లాగిన్లో పంపుతారు. కలెక్టర్ అనుమతితో అక్కడి నుంచి తుది ఎంపిక కోసం రాష్ట్ర అధికారులకు పంపించడం జరుగుతుంది. అక్కడ ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలు పరిశీలించి రెండు నెలల్లో అర్హుల జాబితాను జిల్లా కార్యాలయం ద్వారా స్థానిక అధికారులకు పంపిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అర్హుల్లో మరణించిన, ఇక్కడి నుంచి వలస వెళ్లిన, వేర్వేరు కారణాలతో అందుబాటులో లేనివారి వివరాలను గుర్తించి వాటిని తొలగించి కొత్తవారికి మంజూరు చేస్తున్నాం.
– రాజేశ్, డీపీఎం, పెన్షన్స్ విభాగం