
భద్రాచలం దేవస్థానంలోనే నేడు తెప్పోత్సవం
రేపు ఉత్తరద్వార దర్శనం.. టిక్కెట్ల సొమ్ము వాపస్
అంతరంగిక ఉత్సవాల్లో భక్తులకు నో పర్మిషన్: ఈవో
భద్రాచలం/ పర్ణశాల, జనవరి 11: భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం భద్రాద్రి రాముడు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం తదితర నిత్యపూజలను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను, ఆండాళ్ అమ్మవారిని, శ్రీకృష్ణ పరమాత్మను బేడా మండపంలో ఉంచి తిరుప్పావై పాశురాలను విన్నవించారు. అనంతరం ఉత్సవమూర్తిని శ్రీకృష్ణావతారంలో సుందరంగా అలంకరించారు. శ్రీమన్నారాయణుడి 9వ అవతారంగా శ్రీకృష్ణుడు గోకులంలో జన్మించి రాక్షస సంహారం చేశాడు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పర్ణశాలలోనూ సీతారామచంద్రస్వామి శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు.
వైభవంగా డోలోత్సవం..
అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి మంగళవారం మధ్యాహ్నం డోలోత్సవం జరిపారు. అంతరాలయంలో మహా నివేదన నిర్వహించారు. ఒక్క శ్రీకృష్ణావతారంలో మాత్రమే డోలోత్సవం జరపడం ఆనవాయితీ.
నేడు తెప్పోత్సవం
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం తెప్పోత్సవం, గురువారం ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలను అంతరంగికంగానే నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే పెద్ద పాత్రలో నీరు పోసి తెప్పోత్సవం జరుపనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర ద్వార దర్శనాన్ని మాత్రం ఉత్తర ద్వారంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వెలుపల జరిగే కార్యక్రమం కాబట్టి భక్తులను రానివ్వకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.
టిక్కెట్ల సొమ్ము వాపస్
ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా కొనసాగే ఉత్తర ద్వార దర్శనాన్ని ఈ సారి నిరాడంబరంగా అంతరంగికంగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి ఆ సొమ్మును తిరిగి వాపస్ చేస్తున్నారు. ఈ వివరాలను ఆలయ ఈవో శివాజీ మంగళవారం వెల్లడించారు. కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రాచలం, పర్ణశాల దేవాలయాల్లో భక్తులకు అనుమతి లేకుండా కొద్దిమంది వైదిక సిబ్బంది సమక్షంలో వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
భక్తులకు అనుమతిలేదు..
కొవిడ్ వ్యాప్తి కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్ణశాల దేవాలయంలో బుధ, గురువారాల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనం ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతిలేదని ఆలయ ఏఈవో భవానీ రామకృష్ణ, సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. అంతరంగికంగానే వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించాలని కోరారు.