
కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్రం
12న జరిగే ధర్నాను జయప్రదం చేయండి
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, నవంబర్ 10: ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చి కేంద్రం కుటిల ప్రేమను చూపిస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన నిలబడుతున్నారన్నారు. వారి కోసం రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నారని అన్నారు. పంటలకు మద్దతు ధర ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి సాగు చేసుకోవచ్చని చెప్తున్నారని, కేంద్రం మాత్రం కొనుగోలు విషయంపై ఏమీ మాట్లాడడంలేదని మండిపడ్డారు. ఈ విషయమై బండి సంజయ్ స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై ఇప్పటికీ ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారన్నారు. కొత్త చట్టాల పేరుతో కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు కూసంపూడి మహేశ్, దొడ్డా హైమావతి, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి రామారావు, తోట సుజలారాణి, కృష్ణయ్య, గాదె సత్యం, రఫీ, అంకమరాజు, నర్సింహారావు, పవన్, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, రాంబాబు, కృష్ణారావు పాల్గొన్నారు.