మధిర, ఆగస్టు 23 : చింతకాని మండలానికి అత్యవసర వైద్య సేవల కోసం 108 వాహనాన్ని కేటాయించాలని బీజేపీ మండలాధ్యక్షుడు కొండ గోపి కోరారు. ఈ మేరకు శనివారం చింతకాని తాసీల్దార్ కరుణాకర్ రెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చింతకాని మండలంలో అత్యవసర వైద్య సహాయానికి వేరే మండలాల నుంచి 108 వాహనం వచ్చేంత వరకు వేచి చూడాల్సి దుస్థితి దాపురించిందన్నారు. దీంతో ప్రైవేట్ వాహనాల్లో అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు గ్రామాల్లో అనేక రోడ్లలో వర్షం కారణంగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడినట్లు తెలిపారు. ఈ కారణంగా వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సమస్య విపరీతంగా పెరిగిందన్నారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, సైడ్ కాల్వల పూడికలు తీయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకల నాగేంద్ర, మందడపు సుబ్బారావు, కన్వీనర్ మద్దినేని వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు ఇమ్మడి సత్యనారాయణ, గోదా మంగయ్య, నాయకులు అనగానే రామారావు, చెన్నూరి నాగచారి, ఉపాధ్యక్షులు మెట్టెల హేమంత్, కొండా వెంకన్న, బక్కా సత్యమూర్తి, యువ మోర్చ అధ్యక్షుడు సత్తెనపల్లి గోపి, పులి ప్రవీణ్ పాల్గొన్నారు.