
రెండు దశాబ్దాలు అధికారంలో ఉండి ఏం చేశారు?
ప్రజలను పక్కదోవ పట్టించడానికే ఆరోపణలు
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరు రూరల్, సెప్టెంబర్ 9: కమ్యూనిస్టులు కళ్లు ఉండీ పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రెండు దశాబ్దాల పాటు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టులకు చిత్తశుద్ధి లేదన్నారు. అభివృద్ధి కాంక్షించే వారైతే వారు అధికారంలో ఉన్న సమయంలో ఏమీ అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నియోజకవర్గంలో పల్లెలు ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, సీసీ రోడ్లు కమ్యూనిస్టులకు కనిపించడం లేదన్నారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణం గతంలో తన హయాంలోనే జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు తన హయాంలోనే 10 మంది వైద్యులు, 13 మంది సిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. నియోజకవర్గ వెనుకబాటుకు కారకులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. బీటీపీఎస్, సీతారామ ప్రాజెక్టుపై పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంతోమంది ఉపాధి పొందే అవకాశం ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సౌకర్యార్థం 52 వైద్య పరీక్షల నిర్వహణకు హబ్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా కారణంగానే ఆస్పత్రిలో సిబ్బంది నియామకాలు జరగలేదని, ఈ విషయాన్ని గుర్తించకుండా ఆందోళనలు చేపట్టడం సబబు కాదన్నారు. చిల్లర రాజకీయాలతో ఎలక్షన్లలో వామపక్షాలకు డిపాజిట్లు కూడా రావడం లేదన్నారు. మణుగూరు పట్టణంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకూ అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు అడపా అప్పారావు, ముత్యంబాబు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఏనిక ప్రసాద్, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాయకులు బొలిశెట్టి నవీన్, పుచ్చకాయల శంకర్, వట్టం రాంబాబు, ఎడ్లశ్రీను, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.