
అన్నదాతల కుటుంబాలకు అండగా ఇన్సూరెన్స్
ఈ నెల 11వ తేదీ వరకు కొత్త రైతులకు అవకాశం
రైతుల తరఫున ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం
కొత్తగూడెం/ మణుగూరు రూరల్, ఆగస్టు 9 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. రుణమాఫీ చేసి వారికి అండగా నిలవగా.. రైతుబంధు పథకంతో కర్షకుల పెట్టుబడి కష్టాలు తీర్చింది. అంతేకాదు ఏదైన కారణంతో రైతు మృతిచెందితే బాధిత కుటుంబానికి బీమా అందజేసి భరోసా కల్పిస్తున్నది. అయితే రైతు బీమాలో కొత్త రైతులు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11 వరకు గడువు విధించింది. పట్టాదారు పాస్ బుక్ ఉండి రైతుబంధు సాయం పొందుతున్న 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసున్న రైతులందరూ రైతుబీమాకు అర్హులే.
అన్నదాతల కుటుంబాలకు అండగా నిలుస్తోంది రైతుబీమా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈ పథకం విశేష ఆదరణ పొందింది. అందరి నుంచీ ప్రశంసలు అందుకున్నది. ఇలాంటి ఈ పథకం ఈ నెల 13 నుంచి నాలుగో ఏట అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ పథకం చేరేందుకు ఇదివరకే నమోదై ఉన్న పాత రైతుల డేటా ఆటోమేటిక్‌గా ఆప్డేట్ కానున్నది. అయితే కొత్త రైతులు చేరేందుకు మాత్రం ఈ నెల 11 వరకు గడువు ఉంది. ఒక్కో రైతు తరఫున ప్రభుత్వమే రూ.2,271.50 చొప్పున ప్రీమియాన్ని బీమా కంపెనీకి చెల్లిస్తుంది. దీంతో ఒక్కో రైతుకు రూ.5 లక్షల బీమా కవరేజీ ఉంటుంది. ప్రమాదవశాత్తు రైతుకు ఆపద ఎదురై మరణిస్తే అతడి నామినీకి, కుటుంబానికి ఆ పరిహారం అందుతుంది. దీంతో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, ఆధార్ కార్డులను సంబంధిత ఏఈవోలకు అందించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో రైతుబీమా పథకం కూడా విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పట్టాదారు పాస్ బుక్ ఉండి రైతుబంధు సాయం పొందుతున్న 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసున్న రైతులందరూ ఈ రైతుబీమాకు అర్హులే. 2018 ఆగస్టు 14న ప్రారంభమైన ఈ పథకం నిర్విరామంగా కొనసాగుతోంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ ఎంతో మంది రైతులు ప్రమాదశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందింది. ఆధార్ కార్డులో ఉన్న వయసును ప్రామాణికంగా తీసుకుంటారు.
నిబంధనలివీ..
రైతు తన భూమిని 2021 ఆగస్టు 3లోపు ధరణిలో నమోదు చేసుకుని ఉండాలి.
రైతులు 18-59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది.
రైతు స్వయంగా నామినేషన్ పత్రంపై సంతకం చేసి భూమి పట్టాదారు పాస్ పుస్తకరం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను ఏఈవోకు అందజేయాలి.