
అమరుల త్యాగ ఫలితంగానే ఆదివాసీలకు హక్కులు
ఆదివాసీ దినోత్సవంలో ప్రజాప్రతినిధులు, నేతలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరల్డ్ ట్రైబ్స్ డే
సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో ఘనంగా
నెట్వర్క్;వేడుకలు జరిగాయి.. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జరిగిన వేడుకలో పీవో గౌతమ్ పోట్రు పాల్గొన్నారు.. ఆదివాసీ డే విశిష్టతను వివరించారు.. గిరిజన, ప్రజా సంఘాల నాయకులు వీధుల్లో ప్రదర్శనలు చేపట్టారు.. ఆదివాసీ నాయకుల త్యాగాలను గ్రామస్తులకు వివరించారు.. పలుచోట్ల గిరిజన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.. వారి సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి..
అమరుల త్యాగాల ఫలితంగానే ఆదివాసీలకు హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు వచ్చాయని ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ‘జల్.. జింగిల్.. జమీన్’ నినాదంతో సాగిన ఆదివాసీ ఉద్యమంలో ఎందరో నేతలు త్యాగధనులయ్యారని గుర్తుచేశారు. అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం వంటి ఆదివాసీ నేతల తిరుగుబాటు తమ హక్కులకు జీవం పోసిందని అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం ఆదివాసీలుగా మన కర్తవ్యమని అన్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగింది. అశ్వారావుపేటలో నిర్వహించిన కొమ్ము నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీ అమరవీరుల చిత్రపటాలకు, విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మణుగూరులో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలంలో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు పాల్గొన్నారు.
ఆదివాసీలకు అండగా ఉంటాం
ఇల్లెందు, ఆగస్టు 9: ఆదివాసీలకు అండగా ఉంటామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోండి, కోయ భాషలను ఔత్సాహిక భాషవేత్తలకు ఉపయోగకరంగా రూపొందించినట్లు చెప్పారు. అనంతరం ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ మాట్లాడుతూ ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తూ అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు. ట్రైబల్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు.