
ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలు
విశ్రాంత ఉద్యోగి గెర్షోమ్ కృషి అభినందనీయం
కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 9: సింగరేణిలో సుదీర్ఘ కాలం పనిచేసి రిటైర్డ్ అయ్యారు గెర్షోమ్. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా సమాజ హితం కోసం తన వంతుగా పనిచేస్తున్నారు. తనకు వచ్చే ఆదాయంలో కొంత నిరుపేదల కోసం వెచ్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దశాబ్దం నుంచి గాంధీ పథం ట్రస్టు నిర్వాహకులు సామాజిక సేవల్లో పాల్గొంటున్నారు. కొత్తగూడెంలో ఏటా జరిగే ఆర్మీ సెలెక్షన్స్‌లో పాల్గొనే యువతకు భోజన వసతి కల్పిస్తున్నారు. అగ్ని ప్రమాదాలతో ఇతర ఘటనల్లో బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఉత్తరాఖండ్‌లో వరదలు వచ్చినప్పుడు ట్రస్టు ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు సేకరించి ఆ రాష్ర్టానికి పంపించారు. తలసేమియా, రోడ్డు ప్రమాద బాధితుల కోసం ఏటా రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.
హరితహారానికి ప్రాముఖ్యత..
రాష్ట్రప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న హరితహారంలో పాల్గొంటున్నారు ట్రస్టు నిర్వాహకులు. ఏడేళ్లుగా జిల్లాలో పది వేల మొక్కలు నాటించారు. వాటిని సంరక్షిస్తున్నారు. అంతేకాక హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని ఇంటింటికీ వెళ్లి మొక్కలు అందజేస్తున్నారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ నిర్వహిస్తూ యువతనూ భాగస్వాములు చేస్తున్నారు. స్వతంత్ర సమర యోధుల జయంతి, వర్థంతి రోజుల్లో విద్యార్థులతో మొక్కలు నాటిస్తున్నారు. చదువుల్లో ప్రతిభ చాటిన చిన్నారులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందజేస్తున్నారు.
సేవలోనే సంతృప్తి..
సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యా. ఉద్యోగం చేస్తూనే ట్రస్టు ఏర్పాటు చేసి సింగరేణి అధికారులనూ దీనిలో భాగస్వాములను చేశా. రిటైర్డ్ అయ్యాక సమాజం కోసం ఎంతో కొంత చేయాలనుకుని ప్రజలకు సేవలు అందిస్తున్నా. ముఖ్యంగా హరితహారం బాగా నచ్చింది. మొక్కలను పంపిణీ చేస్తున్నా. స్వయంగా నాటుతున్నా. సంరక్షిస్తున్నా.
-చింతలచెర్వు గెర్షోమ్, గాంధీ పథం ట్రస్టు నిర్వాహకుడు