
దుకాణాలుతనిఖీ చేయకుండా మామూళ్లు వసూలు
రూ.15 వేలు ఇవ్వాలని వాట్సప్‌లో మెసేజ్
రూ.90 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చండ్రుగొండ ఏవో
చండ్రుగొండ, ఆగస్టు 9: ఫెర్టిలైజర్ దుకాణ యజమానుల నుంచి రూ.90 వేలు లంచం తీసుకుంటూ సోమవారం మండల వ్యవసాయాధికారి మహేశ్ చంద్ర ఛటర్జీ పట్టుబడ్డాడు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చండ్రుగొండ వ్యవసాయశాఖ అధికారిగా మహేశ్ చంద్ర ఛటర్జీ ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఈయన మండల పరిధిలోని అన్ని ఫెర్టిలైజర్ దుకాణాల యాజమానులతో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. తాను షాపుల తనిఖీ చేయకుండా ఉండడానికి నెల నెలా మామూళ్లు ఇవ్వాలని గ్రూప్‌లో మెసేజ్ చేశాడు. ప్రతి దుకాణ యజమాని రూ.15 వేల చొప్పున చెల్లించాలని హుకుం జారీ చేశాడు. దీంతో మండలంలోని ఆరుగురు షాపు యజమానులు గోదా సత్యం, యర్రం సీతరాముయ్య, ముఖేశ్, చెవుల చందర్రావు, వెంకటరామయ్య, మచ్చా కుమార్ గత నెల 30న ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ ప్లాన్ ప్రకారం సోమవారం షాపు యజమానులు గోదా సత్యం, యర్రం సీతరామయ్య అయన్నపాలెం రైతువేదికలో ఏవోకు రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ రమణమూర్తి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. అనంతరం ఏసీబీ అధికారులు మరోవైపు అశ్వారావుపేటలోని ఏవో స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎం.శ్రీనివాస్, ఎన్.రవి, సిబ్బంది పాల్గొన్నారు.
గతంలోనూ ఆరోపణలు..
ఎనిమిది ఏళ్ల నుంచి మండల వ్యవసాయశాఖ అధికారిగా పనిచేస్తున్న ఛటర్జీపై గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఎరువులు, పురుగు మందుల షాపు యజమాన్యాలను ఆదాయ వనరుగా భావించేవాడని, మామూళ్ల కోసం పట్టుబట్టేవాడని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త షాపుల లైసెన్స్‌లకు ఒక రేటు, షాపు తనిఖీలు చేయకుండా ఉండడానికి ఒక రేటు ఫిక్స్ చేసేవాడని షాపుల యాజమానులే బాహాటంగా చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి.
బిల్ బుక్‌తో పాటు ఇతర ప్రభుత్వ అనుమతి పత్రాలపై సంతకాలు పెట్టడానికీ లంచం అడిగేవాడని, మామూలు ఇవ్వనిదే ఆయన వద్ద పని కాదనే వార్తలు గతంలో మండలంలో చక్కర్లు కొట్టాయి. తన బంధువులు, సన్నిహితులకు ఆగ్రో షాపు లైసెన్సులు ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి. తన కింద పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారులను తన దందాలోకి దింపాడని, తాను సూచించిన షాపుల్లోనే రైతులు మందులు, ఎరువులు కొనాలని ఒత్తిడి చేసేవాడని మండల రైతులు వాపోతున్నారు . తాను సూచించిన షాపుల్లో ఎరువులు కొనేవారికే ప్రభుత్వ రాయితీలు అందిస్తామని బెదిరించేవాడని కొందరు రైతులు ఎవరికీ చెప్పులేకపోయారని గతంలో వార్తలు వినిపించాయి