
గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్న ఈజీఎస్ పనులు
గరిష్ఠ వేతనం రూ.245తో కూలీలకు చేకూరుతున్న లబ్ధి
మణుగూరు రూరల్, ఆగస్టు 8: గ్రామీణ ప్రజలకు ఆశాదీపంలా కన్పిస్తోంది ఉపాధి హామీ పథకం. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడినా ఉపాధి పనులు మాత్రం ఆగలేదంటే ఈ పనులకు ఎంత ఆదరణ, ప్రాముఖ్యత ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి అధికారుల ప్రోత్సాహంతో గ్రామీణులు సైతం ఈ పనులను విరివిగా వినియోగించుకున్నారు. ఈజీఎస్ కూలీలందరికీ రూ.245 గరిష్ఠ దినసరి వేతనం లభించింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 2,21,795 జాబ్ కార్డులున్నాయి. బూర్గంపహాడ్ మండలంలో అత్యధికంగా పనిదినాలు నమోదవుతున్నాయి. పనుల్లేక అల్లాడిపోతున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు కల్పించింది. దీంతో వారికి కొంతమేరకు ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. జిల్లా అధికారుల దిశానిర్దేశంలో మండల అభివృద్ధి అధికారుల ప్రత్యేక కృషితో కూలీలు అధిక సంఖ్యలో ఈజీఎస్ పనుల్లో పాల్గొంటూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. పినపాక నియోజకవర్గాన్ని గమనించినా ఈ విషయం స్పష్టమవుతోంది. నియోజకవర్గంలోని బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో అధికారుల ప్రోత్సాహంతో అధిక శాతం మంది కూలీలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకున్నారు. కరోనా సమయంలోనూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించారు. నియోజకవర్గంలో మొత్తం 58,784 జాబ్‌కార్డులు ఉండగా, 23,106 తమంది మహిళలు, 18,710 మంది పురుషులు ఈజీఎస్ పనుల్లో పాల్గొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఏడాదిలో కనీసం 100 రోజులు పని కల్పించేలా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలవుతోంది. గత ఆర్థిక సంవత్సరం గరిష్ఠ కూలి రూ.235 ఉండగా.. ఈ ఏడాది 245గా అధికారులు నిర్ణయించారు.
ఉపాధి పనులివీ..
భూమి అభివృద్ధి, మట్టి తొలిగింపు, మట్టి రహదారుల ఏర్పాటు, పొలాలకు దారి ఏర్పాటు, నీటి కాల్వల సౌకర్యం, చెరువు ఒండ్రు మట్టి తొలగింపు, నీటిని కాపాడడం, చిన్న నీటి పారుదల పనులు, మొక్కలు నాటడం, గుంతలు తీయడం, కల్లాల నిర్మాణం వంటి పనులను ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నారు. గ్రామీణ ప్రజలు ఇలా వారానికి రూ.1400కు పైగా వేతనాన్ని పొందుతున్నారు.
ఉపాధి దొరికింది..
ఆర్పినేని మంగమ్మ, ఉపాధి కూలీ, బూర్గంపహాడ్
కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ పని దొరికింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. ఇలు గడిచింది. నిరంతరం ఉపాధి హామీ పనులు లభించాయి. 100 పని దినాలు కల్పించడంతో మరో పనికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. మండల అధికారులు కూడా ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అధికారులకు సూచనలిస్తున్నాం…
సమావేశాలు ఏర్పాటు చేసి ఉపాధి కూలీలకు అవగాహన కల్పించి రోజూ పని కల్పించాలని అధికారులకు సూచనలిస్తున్నాం. ఏపీవోలు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, కార్యదర్శులకు ఆదేశాలిస్తున్నాం. ఉపాధి కూలీలకు సకాలంలో పనులు కల్పించాలని, వేతనాలు చెల్లించాలని సూచిస్తున్నాం.
-మధుసూదన్‌రాజు,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి (కొత్తగూడెం)