
అద్భుత కట్టడాలు.. అబ్బురపరిచే శిల్పాలు
కాకతీయుల కళావైభవానికి సజీవ సాక్ష్యం
నక్షత్రాకారంలో గణపేశ్వరాలయ నిర్మాణం
అతిపెద్ద శివలింగం ఇక్కడి ప్రత్యేకత
కూసుమంచి, ఆగస్టు 8: కాకతీయుల కళావైభవం వెయ్యేళ్లు అయినా చెక్కుచెదరలేదు. అబ్బురపరిచే నగిశీలతో చేపట్టిన ఆలయ నిర్మాణాలు నభూతో నభవిష్యత్.. గణపతి దేవుడు ప్రతీష్ఠించిన కూసుమంచిలోని శివలింగం దేశంలోనే పెద్దశివలింగాల్లో ఒకటి. నాటి శిల్పకళ, శిల్పుల నైపుణ్యం ఎంత వర్ణించినా తక్కువే.. ఎన్నో ఆలయాలపై అబ్బురపరిచే శిల్పాలు చెక్కి చరిత్రలో నిలిచిపోయారు.
కాకతీయలు కళానైపుణ్యం నుంచి జాలువారిన మరో అద్భుత కట్టడం కూసుమంచిలోని గణపేశ్వరాలయం. దీన్ని 11 వందల సంవత్సరాల క్రితం గణపతి దేవుడు నిర్మించారు. ఆలయంలోని శిల్పాలు భక్తులు, పర్యాటకుల మనసు చేస్తోంది. రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు రావడంతో కాకతీయుల కళానైపుణ్యం మరోసారి వెలుగులోకి వచ్చింది.
నక్షత్రాకారంలో..
కూసుమంచికి ఉత్తరాన నక్షత్రాకారంలో శివాలయం నిర్మించారు. కాకతీయరాజు గణపతి దేవుడు శివలింగాన్ని ప్రతీష్ఠించారు. అప్పటి శిల్ప కళానైపుణ్యం వారి పటిష్ఠమైన కట్టడాలకు తార్కాణం. ఆలయంలోకి ప్రవేశించడానికి మూడువైపులా మెట్లు ఏర్పాటు చేశారు. మూడున్నర అడుగుల శివలింగం, అతిపెద్ద పానుగొట్టం అతిపెద్ద రాతిబండు రాళ్లతో ఆలయాన్ని నిర్మించారు. గుడిగోడలు వెలుపల రాతి కట్టడాలు.. లోపల రాతికట్టడాలతో నిర్మించారు. ఎండకాలంలోనూ చల్లగా ఉండడం ఆలయం ప్రత్యేకత.
ఇసుకతో నిర్మాణం…
శివాలయం ఇసుకతో నిర్మించారు. 15 ఏళ్లక్రితం ధ్వజస్తంభం లేకపోవడంతో దాని కోసం గోయితీశారు. మొత్తం ఎర్రటి ఇసుక వచ్చింది. ఇసుకతో నిర్మాణం ఎలా సాధ్యమైంది అనేదానిపై అనేక మంది పరిశోధన చేశారు. కాకతీయుల కట్టడాలన్నీ భూకంపాలకు తట్టుకునే విధంగా ఇసుకతో నిర్మించారని తెలుసుకున్నారు. అతిపెద్ద రాతిబండలు అంతపైకి ఎలా లేపారు అనేది నేటికి అర్థం కాని ప్రశ్న.
శివలింగంపై నేరుగా సూర్యకిరణాలు..
ఏటా ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షణాయన పుణ్యకాలం రెండూ ఉంటాయి. సూర్యుడు తూర్పున ఉదయించే సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో.. ఉత్తరం వైపు సూర్యుడు ఉదయించినా శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. దక్షిణాయన పుణ్యకాలంలో సూర్యుడు ఉదయించినా.. సూర్యకిరణాలు శివలింగంపై పడడం విశేషం. శివలింగాకారం పానుగొట్టం నిర్మాణం బంగారం గొలుసు తయారు చేసినట్లు బండరాళ్లపై నగిశీలు చెక్కారు. శివాలయం ఉత్తరం, దక్షిణం, పడమర మూడుదిక్కులూ చిన్న చిన్న గుడులతో నిర్మించారు.