
కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్
భారీగా తరలొచ్చిన అభ్యర్థులు
ఉపాధి కల్పనకు మినీ జాబ్‌మేళాల నిర్వహణ భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నియామక పత్రాలు అందజేసిన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
అభ్యర్థుల కోసం 3 ప్రత్యేక బస్సులు..
కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 6 : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు భారీగా అభ్యర్థులు తరలొచ్చారు. సుమారు 40 ప్రైవేట్ కంపెనీలు పాల్గొనగా.. వివిధ ప్రాంతాల నుంచి 11,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 6,500 మందికి ఉద్యోగాలు లభించాయి.ఈ జాబ్‌మేళాకు వచ్చే అభ్యర్థుల కోసం ఆర్టీసీ మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ప్రగతి మైదాన్‌లో శనివారం జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు యువతీ యువకుల నుంచి విశేష స్పందన వచ్చింది. మేళాకు సుమారు 11 వేల మందికిపైగా హాజరు కాగా 40 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి 6,500 మందికి కొలువులు ఇచ్చారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఎల్అండ్టీ కంపెనీలో 650 మంది, హ్యుండయ్ మోటార్స్‌లో 300 మంది, విప్రోలో 12 మంది, టెక్ మహేంద్రాలో 35, వైఎస్‌కే ఇన్ఫోటెక్లో 30, అమర రాజా బ్యాటరీస్‌లో 180, మేధా సర్వో డ్రైవ్‌లో 160, నవత ట్రాన్స్‌పోర్ట్‌లో 185, వీవీసీ అండ్ వీఆర్ఏ మోటార్స్‌లో 45, వరుణ్ మోటార్స్‌లో 180, అపోలో ఫార్మసీలో 118, ముత్తూట్ గ్రూప్‌లో 260, ఎంఆర్‌లో 160, ఎల్ఐసీలో 1,200, కెమిక్ లైక్ సైన్సెస్‌లో 60, బజాజ్ అలియన్స్లో 173, జీ4ఎస్ సెక్యూరిటీస్‌లో 650, టాటా స్ట్రెల్లో 35, ఎడిఫై స్కిల్స్‌లో 125, కేవీబీలో 85, శ్రీమంత్రిలో 150, ఆల్ ప్రెస్ట్ టెక్నాలజీస్‌లో 220, నానో డెవలపర్స్‌లో 180, ఎయిర్టెల్, వొడాఫోన్‌లో 110, ఐఎంసీలో 150, కార్వీలో 121, కాలిబర్ బిజినెస్ సొల్యూషన్స్‌లో 160, హెచ్‌డీఎఫ్‌సీలో 100, సుస్థిర ఇన్ఫ్రాలో 40, శుభగృహలో 300, ప్రీమియర్ హెల్త్ సర్వీసెస్‌లో 50, ప్రథమ్ ఎడ్యుకేషన్‌లో ఒకరికి, నాక్‌లో 18, డీసీకేలో 50, టెక్ షోర్లో 300 మందికి కొలువులు లభించాయి.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి : కలెక్టర్ అనుదీప్
అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సూచించారు. ఇంగ్లిష్‌పై విద్యార్థులు శ్రద్ధ వహించాలన్నారు. ఉద్యోగంలో వేతనం ఎంత అన్నది చూడొద్దన్నారు. అనుభవం ద్వారా మున్ముందు మంచి అవకాశాలు వస్తాయన్నారు. కొవిడ్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నదన్నారు. తాను కూడా కెరీర్ ఆరంభంలో చిన్న ఉద్యోగం చేశానని, ఎన్నో అనుభవాల ద్వారా ఐఏఎస్ అయ్యానన్నారు. ఉద్యోగ రీత్యా దూరం వెళ్లాల్సి వచ్చినా నిర్భయంగా వెళ్లాలన్నారు. ఉన్నచోట ఉద్యోగాలు సాధ్యం కాదన్నారు. మున్ముందు మినీ జాబ్ మేళాలకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఉపాధి కల్పన అధికారులను ఆదేశించారు. ఉద్యోగం రాని వారు నైపుణ్యాలు పెంచుకుని ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి విజేత, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
జాబ్‌మేళా విజయవంతం
మెగా జాబ్‌మేళా విజయవంతం కావడం సంతోషాన్నిచ్చింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమందికి ఉపాధి లభించడం ఆనందదాయకం. ఉపాధి కల్పించిన ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులకు ధన్యవాదాలు. మున్ముందు మినీ జాబ్‌మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం.
చాలా సంతోషంగా ఉన్నది..
నేను హైదరాబాద్‌లో బీటెక్ (ఐటీ) పూర్తి చేశా. మెగా జాబ్ మేళా గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చా. ఎస్బీఐలో జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూకు హాజరయ్యా. షార్ట్ లిస్ట్‌లో నా పేరు వచ్చింది. వారం రోజుల్లో జాబ్ ప్రకటిస్తామని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. నేను అనుకున్న రంగంలో ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుందనే నమ్మకం ఉంది.
అభ్యర్థుల కోసం మూడు ప్రత్యేక బస్సులు..
మెగా జాబ్‌మేళాకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది వస్తారని అంచనా వేసి అధికారులు బస్టాండ్ నుంచి మూడు ఆర్టీసీ బస్సులు కేటాయించారు. తక్కువ ఖర్చుతో ప్రగతి మైదాన్‌కు చేరవేయడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. మెగా జాబ్‌మేళాపై గ్రామాల్లో టముకు వేయించడంతో అభ్యర్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. వేలాదిగా అభ్యర్థులు రావడంతో ప్రగతి మైదాన్ కిటకిటలాడింది. వారంతా తమ విద్యార్హతను బట్టి వివిధ స్టాళ్లలో కంపెనీలు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.