
అమలులోకి ఆన్లైన్ విధానం
భవనంలో సకల వసతులు.. ఆలనా పాలనకు ఆయమ్మలు
ఆరోగ్య సంరక్షణకు వైద్యుడు, ఏఎన్ఎం బృందం
త్వరలో ప్రారంభోత్సవం
కొత్తగూడెం ఆగస్టు 6 : ఎవరో తప్పు చేస్తే చిన్నారులు ఎందుకు శిక్ష అనుభవించాలి? అనాథలుగా ఎందుకు మిగిలిపోవాలి? అమ్మానాన్నల కోసం పసికందులు ఎందుకు కన్నీరు పెట్టాలి? వీరిలో తల్లిదండ్రులు వదిలివేసిన వారు కొందరైతే, అనుకోని కారణాలతో అనాథలుగా మారినవారు మరికొందరు. వారిని ఆదుకోవడాన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించింది. వారికి ఆశ్రయం కల్పించి అమ్మానాన్న లేని లోటును భర్తీ చేస్తున్నది. వారిని దత్తత తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. అందుకు భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం బాలల సదనం భవనాన్ని శిశు గృహ కేంద్రంగా మార్చింది. అన్ని సౌకర్యాలతో ఏర్పాటైన భవనం త్వరలో ప్రారంభం కానున్నది.
అనాథ పిల్లలకు ఆలంబనగా..
తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అనాథలకు ఆలంబనగా శిశు గృహ కేంద్రం ఏర్పాటైంది. శిశువు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతారు. చిన్నారులను కంటికి రెప్పలా చూసుకునేందుకు ఆరుగురు ఆయమ్మలు అందుబాటులో ఉంటారు. ఎదిగిన పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు శిశుగృహలో ఉంటాయి. వారికి మూడు పూటలా మంచి పౌష్టికాహారం అందతుంది. వారికి ఆరోగ్య సంరక్షణ కోసం ఒక వైద్యుడు, ఏఎన్ఎం నియమితులయ్యారు. శిశు గృహాన్ని మేనేజర్ అన్ని సౌకర్యాలను పర్యవేక్షిస్తారు. ఇప్పటికే కలెక్టర్ అనుదీప్, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి వరలక్ష్మి శిశుగృహ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఐసీసీఎస్ అధికారిణి హరికుమారి పిల్లల పెంపకంతో పాటు తదితర వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు. ఇక్కడి పిల్లలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నది. అందుకోసం ప్రత్యేకంగా ఈ- సెంటర్ ఏర్పాటు కానున్నది. త్వరలో శిశుగృహ ప్రారంభం కానున్నది.
భద్రాద్రి జిల్లాలో అనాథ పిల్లల వివరాలు
భద్రాద్రి జిల్లాలో గతంలో 11 అనాథశరణాలయాలుండేవి. కొవిడ్ కారణంగా కొన్ని కేంద్రాలు తెరచుకోవడం లేదు. ఇప్పటి వరకు 4 కేంద్రాల్లో 64 మంది పిల్లలున్నారు. వీరిలో 15 మంది తల్లిదండ్రులను కోల్పోయినవారు ఉన్నారు. 8 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగినవారు మరో 15 మంది పిల్లలు ఖమ్మం శిశుగృహంలో ఉన్నారు.
అక్రమ దత్తతతో చిక్కులు..
అక్రమ పద్ధతిలో పిల్లలను దత్తత తీసుకుంటే మన్ముందు సమస్యలు రావొచ్చు. కుటుంబంలో పొరపచ్చాలు రావడం, దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు సంతానం కలగడం వంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉన్నది. దీంతో దత్తత వెళ్లిన పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నది. ప్రైవేటు వ్యక్తుల ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటే ఎప్పటికైనా సమస్యలు రావొచ్చు. అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుని తర్వాత వారికి పిల్లలు పుట్టిన తర్వాత వారిని వదిలి వేసిన సంఘటనలు ఇటీవల జిల్లాలో జరిగాయి.
దత్తతకు ఆన్లైన్ విధానం..
సంతానం కలగని దంపతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియను మరింత సులభతరం చేశాయి. గతంలోని మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చాయి. స్త్రీ శిశు సంక్షేమశాఖ, అనుబంధ శాఖల అధికారులు అనేక రకాలుగా సాయం అందిస్తున్నప్పటికీ ఇప్పటికీ కొందరు అక్రమ మార్గంలో పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి దతత్తకు చట్టబద్ధత తప్పనిసరి అని తేల్చి చెప్పాయి.
అన్ని వసతులతో భవనాలు..
శిశు గృహ భవనాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాం. గతంలో ఇక్కడ దత్తత సెంటర్ లేనందున ఇక్కడి పిల్లలను ఖమ్మం తరలించాల్సి వచ్చేది. సుమారు 15 మంది పిల్లలను ఖమ్మానికి తరలించాం. సమాజంలో ప్రస్తుతం ఎక్కువ మంది పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటున్నారు. దీని మన్ముందు సమస్యలు రావొచ్చు. చట్ట పరంగా దత్తత తీసుకోవడం అన్ని విధాలా మంచిది. –వరలక్ష్మి. డీడబ్ల్యూవో, కొత్తగూడెం