
సత్తుపల్లి రూరల్, ఆగస్టు 2: సంక్షేమానికి చిరునామా తెలంగాణ రాష్ట్రమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ కింద 47 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన చెక్కులను, కల్యాణలక్ష్మి కింద 18 మందికి రూ.18 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. గత మార్చి బడ్జెట్లో దళితుల కోసం రూ.1000 కోట్లను కేటాయించారన్నారు. దళితబంధు పథకం ఏర్పాటుకు ఏడాది క్రితమే పునాది వేశారన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం ఏమేమి చర్యలు చేపట్టాలనే అంశాలపై అప్పుడే దళిత ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమై చర్చించారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 7500 మందికి రూ.70 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జిల్లాకే ఆదర్శమని అన్నారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, గాదె సత్యం, వెల్ది జగన్మోహనరావు, కనగాల వెంకట్రావు, తహసీల్దార్ కే.మీనన్, కమిషనర్ సుజాత, నయబ్ తహసీల్దార్ సంపత్, ఆర్ఐలు జగదీశ్, విజయభాస్కర్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.