కల్లూరు రూరల్, సెప్టెంబర్ 18 : బత్తులపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు శీలం బ్రహ్మానందరెడ్డి, కూరాకుల పవన్‌కల్యాణ్ ద్విచక్రవాహనంపై కప్పలబంధం నాగార్జునసాగర్ కాల్వ కట్టపై శనివారం కృష్ణా జిల్లా తిరువూరు వెళ్తున్న సందర్భంగా ప్రమాదవశాత్తూ కాల్వలో పడి గల్లంతయ్యారు. పెనుబల్లి సీఐ సీహెచ్.హనోక్, ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల తల్లిదండ్రుల రోదన ఘటన స్థలంలో ఉన్నవారికి కంటతడి పెట్టించింది. ఆ ఇద్దరు స్నేహితుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
ఎమ్మెల్యే సండ్ర పరామర్శ : కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయిన బ్రహ్మనందరెడ్డి, పవన్‌కల్యాణ్‌ల కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం పరామర్శించారు. చేతికొచ్చిన కొడుకులను కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఆయన వెంట జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, నాయకులు పసుమర్తి చందర్రావు, పెడకంటి రామకృష్ణ, ఉబ్బన రత్నం, కొర్రా రుక్మిణి, సీహెచ్. కిరణ్‌కుమార్, శీలం కృష్ణారెడ్డి, బొగ్గుల రామిరెడ్డి, ఆయిలూరి నర్సిరెడ్డి, కొర్రా నర్సింహారావు, కృష్ణ తదితరులున్నారు.