
సత్తుపల్లి, సెప్టెంబర్ 30: సత్తుపల్లిలో ఉన్న 50 బెడ్ల ఆసుపత్రిని 100 బెడ్ల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతులు ఇవ్వడంతోపాటు రూ.34 కోట్ల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1972లో నిర్మించిన సత్తుపల్లి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు, వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఇటీవల కేబినెట్ సైతం ఈ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆమోదం తెలపడంతో నిధులు కూడా మంజూరయ్యాయన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాత బిల్డింగ్‌ను పిల్లల ఆసుపత్రిగా మారుస్తామని, పెనుబల్లి, కల్లూరు ఆసుపత్రులను ఆధునీకరిస్తామని అన్నారు. అక్కడ నూతన భవన నిర్మాణాల కోసం కృషిచేస్తామని చెప్పారు. శిథిలావస్థకు చేరిన సత్తుపల్లి బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల, కల్లూరు జూనియర్ కళాశాల నిర్మాణానికి కృషిచేస్తామన్నారు. ఎంఈవోలతో త్వరలో సమావేశమై పాఠశాలల స్థితిగతులను తెలుసుకుంటామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తం ఎమ్మెల్యేకు ఇచ్చే నిధుల్లో రూ.2 కోట్లను విద్యారంగానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కల్లూరు మండల అధ్యక్ష కార్యదర్శులు మినహా అన్ని మండలాల్లోనూ పూర్తిస్థాయిలో మండల, గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తయిందన్నారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గాదె సత్యం, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య పాల్గొన్నారు.