ఆయిల్‌ఫెడ్ అధికారుల అనాలోచిత నిర్ణయం సంస్థకు పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టింది. మినరల్ వాటర్ బిజినెస్‌లోకి ప్రవేశించాలనుకుంటే మొత్తానికే మునిగే పరిస్థితి ఎదురైంది. రూ.2.44 కోట్లు ఖర్చు చేసినా చివరికి రూ.వేలల్లో కూడా అమ్మకాలు జరగలేదు. దీంతో వ్యాపారాన్ని మొత్తానికే మూసివేయాల్సిన దుస్థితి దాపురించింది. ఆఖరికి ఆయిల్‌ఫెడ్ సంస్థపైనా, అన్నదాతలపైనా ఆర్థిక భారం పడడం తప్ప పైసా ప్రయోజనం లేకపోయింది. ఇదీ.. దమ్మపేట పామాయిల్ మినరల్ వాటర్ బిజినెస్‌లో ప్రవేశం పేరిట చేసిన ప్రయత్నంలో ఆయిల్‌ఫెడ్ అధికారులకు ఎదురైన వైఫల్యం.
– అశ్వారావుపేట, ఫిబ్రవరి 20
ఆయిల్‌పాం సాగు విస్తరణలో లక్ష్యాలను చేరుకోలేక సతమతమవుతున్న ఆయిల్‌ఫెడ్ సంస్థ ఎలాంటి అనుభవం, సంబంధం లేని వాటర్ బిజినెస్‌లోకి దిగి చేతులు కాల్చుకున్నది. వ్యాపార విస్తరణ, మార్కెటింగ్ సౌకర్యంలో ఏమాత్రం పరిజ్ఞానం లేకపోవడంతో రూ.2.44 కోట్ల మేర నిధులు నిరుపయోగంగా మారాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దమ్మపేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రూ.2.44 కోట్ల వ్యయంతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. ఆ పెట్టుబడికి తగిన విధంగా ప్రతి నెలా రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు టర్నోవర్ జరగాలి. కానీ, రూ.వేలల్లోకి వ్యాపారం పడిపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. చివరి ప్రయత్నంగా ప్లాంటును లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించి టెండర్లు కూడా పిలిచారు. స్పందన లేకపోగా.. కొందరు వ్యాపారులు ప్లాంట్‌ను చూసి వెనక్కి వెళ్లిపోయారు. 2024 ఏప్రిల్ వరకు ప్రైవేట్ వ్యాపారుల కోసం ఎదురుచూసిన ఉన్నతాధికారులు తుది నిర్ణయంగా ప్లాంట్‌ను మూసివేశారు. దీంతో ప్లాంట్ నిర్మాణానికి వెచ్చించిన రూ.2.44 కోట్ల సంస్థ నిధులు నిరుపయోగమయ్యాయి.
ఆయిల్‌ఫెడ్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో తమపై ఆర్థిక భారం పడుతుందని పలువురు రైతులు మండిపడుతున్నారు. కనీసం మార్కెటింగ్ సౌకర్యం అంచనా వేసుకోకుండా ఆయిల్‌ఫెడ్ సంస్థకు సంబంధం లేని నీళ్ల వ్యాపారంలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకున్నా సంస్థకైనా, రైతులకైనా ప్రయోజనం ఉండేదని సూచిస్తున్నారు.
ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయంతో సంస్థ ఆర్థికంగా నష్టపోయింది. ఐదేళ్లలో పెట్టిన పెట్టుబడి రూ.2.44 కోట్లకు కనీసం రూ.2 వడ్డీ వేసుకున్నా నెలకు రూ.4.88 లక్షల వరకు నష్టపోయింది. ఐదేళ్లలో ఈ నష్టం అంచనా రూ.2.93 కోట్లు. ఒకవేళ బ్యాంక్ వడ్డీ సుమారు రూ.1.25 చొప్పున లెక్కించినా.. ఏడాదికి రూ.3 లక్షల సంస్థ నష్టపోయింది. ఐదేళ్లలో ఈ నష్టం రూ.1.83 కోట్ల వరకు ఉంటుంది. ప్రతిరోజూ 2,400 కేస్ల నీటి వ్యాపారం జరిగితేనే నష్టం లేకుండా ప్లాంట్ నిర్వహణ కొనసాగుతుంది. బయట మార్కెట్లో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 ఉంది. సంస్థ డీలర్‌కు ఇచ్చే ధర సుమారు రూ.7.70 అయినా మార్కెట్ చేసుకోలేకపోయింది. ప్లాంట్ ప్రారంభంలో అతి విశ్వాసంతో వాటర్ బాటిళ్లను ఉత్పత్తి చేసిన సంస్థ తర్వాత 1,000 కేస్ల బాటిళ్లను సైతం విక్రయించలేకపోయింది. ఫలితంగా సంస్థ ఆర్థిక నష్టాన్ని భారీగా చవిచూడాల్సి వచ్చింది.
వాటర్ ప్లాంట్‌ను 2021లో నిర్మించాం. 2024 ఏప్రిల్ వరకు మార్కెటింగ్ కోసం ప్రయత్నించాం. సరైన మార్కెట్ లేకపోవడంతో లీజుకు ఇచ్చేందుకు టెండర్ కూడా పిలిచాం. వ్యాపారుల నుంచి స్పందన లేకపోవడంతో ప్లాంట్‌ను మూసివేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
-కల్యాణ్, మేనేజర్, పామాయిల్ ఫ్యాక్టరీ, దమ్మపేట