ముదిగొండ, సెప్టెంబర్ 20: మండలంలో సంచలనం నృష్టించిన సూది మందు హత్య నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. మండలంలోని బాణాపురం-వల్లభి మధ్య సోమవారం ఉదయం జమాల్ సాహెబ్‌ను అపరిచితుడు లిఫ్ట్ అడిగి వెనుక కూర్చున్నాడు. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత అతడు జమాల్ సాహెబ్‌కు విషపు ఇంజక్షన్ గుచ్చి పరారయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జమాల్ సాహెబ్ మృతిచెందాడు. ఇలాంటి ఘటన మండలంలో జరగడం మొదటి సారి. దీంతో మండలం ఒక్కసారిగా ఉల్కిపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎప్పటికైనా పోలీసులకు దొరికిపోతామని భయపడిన ఇద్దరు నిందితులు.. ఓ ప్రజాప్రతినిధి ద్వారా పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. నిందితులను చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామస్తులుగా గుర్తించినట్లు తెలిసింది. వీరికి ఓ ఆర్ఎంపీ సహకరించినట్లు సమాచారం. ఇతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు బుధవారం వివరాలు వెల్లడించవచ్చని, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టవచ్చని తెలిసింది.