
ఖమ్మం, ఆగస్టు 2: టోక్కో ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు ప్రదర్శించిన ఆట, కాంస్యం సాధించిన తీరు అద్భుతమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. పీవీ సింధు కాంస్య పతకం సాధించడం పట్ల సోమవారం మధ్యాహ్నం ఖమ్మం పటేల్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన అభినందన సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. అనంతరం ఇండోర్ స్టేడియం గోడకు ఉన్న సింధు వాల్ పెయింటింగ్‌కు సీపీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి స్వీట్ తినిపించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో ఆడాలనుకునే మహిళా క్రీడాకారులకు సింధు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించిందని, దేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచిందని అన్నారు. తెలంగాణ ప్రబుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని అన్నారు. మేయర్ నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, జిల్లా క్రీడల అధికారి మందపాటి పరంధామరెడ్డి, కార్పొరేటర్లు చావా మాధురి నారాయణరావు, కమర్తపు మురళి, ఒలింపిక్ కమిటీ జిల్లా సెక్రటరీ అనంతరాములు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు సిరిపురపు సుదర్శన్, వెంకటరావు, గోవిందరెడ్డి, వెంకటేశ్వర్లు, షఫీ, వీరభద్రరావు, రూపా, మతిన్, క్రిష్టాఫర్, ఫణికుమార్, కోచ్‌లు గౌస్, ఎండీ అక్బర్, శివ, సురేశ్, పవన్ పాల్గొన్నారు.