
ఖమ్మం సిటీ, అక్టోబర్ 12: రెండు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం నగరంలో డీఎంహెచ్‌వో మాలతితో కలిసి వ్యాక్సినేషన్‌పై వైద్యారోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో తాను పర్యటిస్తానని, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఆరా తీస్తానని అన్నారు. ఇచ్చిన సమాచారం తప్పు అని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడిచిన ముప్పై రోజుల్లో ఎన్ని కొవిడ్ కేసులు వచ్చాయి..? ఏ పీహెచ్సీ పరిధిలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి? అని వైద్యాధికారులను ప్రశ్నించారు. జీరో కేసులు నమోదైన పీహెచ్‌సీలు తెలపాలని కోరగా బోనకల్, తల్లాడ అని సంబంధిత వైద్యాధికారులు సమాధానమిచ్చారు. జ్వర పీడితులకు కొవిడ్ పరీక్షలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంచాలకుడు సూచించారు. ప్రతిరోజూ ఒక్కో పీహెచ్సీ పరిధిలో కొవిడ్ 100 టెస్ట్‌లు చేయాలని సూచించారు. కొవిడ్ వచ్చిన వారితోపాటు వారి కాంటాక్టులను గుర్తించాలన్నారు. వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయించాలన్నారు. ప్రభుత్వం డయాగ్నస్టిక్ హబ్‌లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గడిచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈసారి డెంగీ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇతర వ్యాధులు సైతం అదుపులో ఉన్నాయన్నారు. ఈ ఘనత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల లోకల్ బాడీస్కే దక్కుతుందన్నారు.
పల్లె దవాఖానలతో మేలు..
ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో పీహెచ్‌సీలకు అనుబంధంగా ఉన్న సబ్ సెంటర్స్‌ను పల్లె దవాఖానలుగా మారుస్తోందని రాష్ట్ర వైద్య సంచాలకుడు అన్నారు. జిల్లాకు మంజూరైన వైద్యుల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. గడిచిన ఆరేండ్లలో సర్కార్ 6,500 మంది వైద్యులను నియమించిందన్నారు. మరో ఐదేండ్లలో ఈ సంఖ్య 10 వేలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టుల జాబితా సిద్ధం చేయాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్స్, పీహెచ్‌సీల్లో దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న వైద్యుల ప్రమోషన్లపై జీవో జారీ చేశామన్నారు. ఎంబీబీఎస్ వైద్యులంతా పీజీ కోర్సుకు సాధన చేయాలన్నారు. సమావేశంలో మెడికల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్స్ పాల్గొన్నారు.
వైద్యాధికారులకు చురకలు..
కొవిడ్ వ్యాక్సినేషన్‌పై పూర్తిస్థాయిలో సమీక్షించిన రాష్ట్ర వైద్య సంచాలకుడు జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పట్టణస్థాయి నుంచి గ్రామీణస్థాయి వరకు పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఎంత మందికి టీకా వేశారు? ఇంకా ఎంతమందికి టీకా ఇవ్వాలి?’ అని ఆయన ప్రశ్నించగా ఒక్క వైద్యాధికారైనా తిరిగి సమాధానమివ్వలేదు. ‘ఈ రోజు ఎన్ని కేంద్రాలను సందర్శించారు?’ అని డైరెక్టర్ ఖమ్మంలోని శ్రీనివాసనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ కో-ఆర్డినేటర్‌ను ప్రశ్నించారు. ‘ఐదింటింలో రెండు’ అని సదరు వైద్యాధికారి సమాధానమిచ్చారు. ‘మిగిలిన మూడు కేంద్రాలకు ఎందుకు వెళ్లలేదు..’ అని డైరెక్టర్ ప్రశ్నించగా ‘వాహనం లేదు సార్.. రోజూ ఆటోలో ఆస్పత్రికి వస్తున్నా’ అని వైద్యాధికారి బదులిచ్చారు. విస్తుపోయిన డైరెక్టర్ ‘నాకు మీరంతా సినిమా చూపిస్తున్నారు’.. మీ కష్టాలు చూస్తుంటే నా కారు ఇచ్చి వెళ్లిపోవాలని ఉంది’ అని చురకలంటించారు.