
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు అమలైతే చిన్న, సన్నకారు రైతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఖమ్మంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో ఆయా పార్టీల అనుబంధ రైతు సంఘాల నాయకులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే భవిష్యత్తులో రైతు అనే వాడిని చూడడం కష్టతరమవుతుందని అన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే లబ్ధి చేకూరే ఈ చట్టాల వల్ల రైతులకు ఏ మాత్రమూ ఉపయోగం లేదని స్పష్టం చేశారు. రైతులు ఇన్నేళ్లూ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టి తమ గోడు వెళ్లబోసుకున్నా కేంద్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్రం ఒకవైపు రైతులకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తుంటే తెలంగాణ సర్కారు మాత్రం రైతు పక్షపాతి ధోరణి అవలంబిస్తోందని అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలు యావత్ దేశానికి ఆదర్శమవుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల వల్ల వ్యవసాయ రంగం మరింత బలోపేతమైందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకొచ్చే నూతన విద్యుత్ చట్టం కూడా రైతన్నకు గుదిబండగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలకు, పోరాటాలకు అద్దం పట్టే ‘రైతన్న’ సినిమాను ఆదరించాలని కోరారు. రైతులు, రైతు సంఘం నాయకుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేసినట్లు చెప్పారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, వివిధ పార్టీల అనుబంధ రైతుల సంఘాల నాయకులు మాదినేని రమేశ్, బొంతు రాంబాబు, అడపా రామకోటయ్య, గోవింద్, చుంచు వినయ్, ఆవుల వెంకటేశ్వర్లు, వాసురెడ్డి భాస్కర్‌రావు, బెజవాడ రవి, గజ్జెల వెంకన్న, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వనమాతో భేటీ..
పాల్వంచ, సెప్టెంబర్ 30: పాల్వంచలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును గురువారం సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. తాను తీసిన ‘రైతన్న’ సినిమా గురించి చర్చించారు.