అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్, ఫిబ్రవరి 25: సర్కారు బడుల్లోనూ కార్పొరేట్‌కు దీటైన విద్యను అందించే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రధానంగా ముందుకెళ్తోందని అన్నారు. తద్వారా ప్రభుత్వ విద్య బలోపేతమవుతుందని, పేద విద్యార్థులకూ నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. మండలంలోని అచ్యుతాపురంలో ‘మన ఊరు-మన బడి’లో తీర్చిదిద్దిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులందరికీ తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని, ఇంగ్లిష్ మీడియంలో చదివించుకోవాలని ఉంటుందని అన్నారు. ఈ ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చుతోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, 1వ తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను అందిస్తోందని వివరించారు. ఇదే క్రమంలో మాతృభాషకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నామని, సెకండ్ లాంగ్వేజ్‌లో రెండో భాషగా దానిని తప్పనిసరి చేశామని గుర్తుచేశారు.
ఇంగ్లిష్ మీడియం బోధన వల్ల మున్ముందు ఉన్నత చదువుల్లోనూ, పోటీల్లో పరక్షీల్లోనూ ఉత్తీర్ణత సాధించేందుకు, నైపుణ్యం పెంచుకునేందుకు దోహదం కలుగుతుందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పువ్వాడ, సీఎం కేసీఆర్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. ‘మన ఊరు – మన బడి’ పథకం అమలులో భద్రాద్రి జిల్లా రాష్ట్రంలోనే ముందుందని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పథకం ప్రదర్శనలో భద్రాద్రి జిల్లాకు ప్రసంశలు రావడం గర్వంగా ఉందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కూరాకుల నాగభూషణం, దిండిగాల రాజేందర్, కంచర్ల చంద్రశేఖర్, విద్యాలత, సోమశేఖర్ శర్మ, సురేశ్‌కుమార్, చిన్నంశెట్టి వరలక్ష్మి, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కార్యాలయంలో భోజనం..
అనంతరం నారంవారిగూడెంలో బీఆర్ఎస్ నాయకుడు, అశ్వారావుపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు నూతక్కి నాగేశ్వరరావు విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడ నుంచి అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని అక్కడ భోజనం చేశారు. తర్వాత పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. ఆర్టీఏ సేవలను సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, మార్చి 7న కార్యాలయాన్ని ప్రారంభిస్తామని అన్నారు.