
సత్తుపల్లి/ ఖమ్మం రూరల్/ భద్రాచలం/ పాల్వంచ రూరల్/ చర్ల/ కొణిజర్ల/ దుమ్ముగూడెం/ పర్ణశాల, సెప్టెంబర్ 7: రెండు రోజుల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. తాలిపేరు, కిన్నెరసాని గేట్లు ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. కొన్ని చోట్ల వాగులు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు, ఆకేరుకు వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఖమ్మం రూరల్ గోళ్లపాడు – తీర్థాల మధ్య ఉన్న వంతెనపైకి వరద నీరు రావడంతో అధికారులు అటువైపు రాకపోకలను నిలిపి వేశారు. కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో గల నిమ్మవాగు వరద ఉధృతి రెండో రోజూ కొనసాగింది. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రెండు రోజులూ నిమ్మవాగు బ్రిడ్జి మీదుగా ప్రవహించింది. తీగలబంజర సమీపంలోని పగిడేరు సైతం ఉధృతంగా ప్రవహించింది. దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటి ప్రవాహం 15 అడుగులకు చేరింది. పర్ణశాలలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లోని సీతవాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నారచీరెల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు కాగా 17.6 అడుగులకు చేరి అలుగు పారుతోంది.
పెరుగుతున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. సోమవారం రాత్రి 8 గంటలకు 27 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 32.7 అడుగులకు చేరుకుంది. సాయంత్రం 6 గంటలకు 34.50 అడుగులుగా నమోదైంది. రాత్రి 10 గంటలకు 35.1 అడుగులకు చేరుకుంది. స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి.
32వేల క్యూసెక్కుల విడుదల
కిన్నెరసానిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. డ్యామ్సైట్ అధికారులు మంగళవారం ఉదయం ఆరు గేట్లను ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 405.5 అడుగులు ఉంది.
తాలిపేరు 22 గేట్ల ఎత్తివేత..
తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అధికారులు అప్రమత్తమై 22 గేట్లు పూర్తిగా ఎత్తి 54,835 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
బాధితులకు ఎమ్మెల్యే వనమా పరామర్శ
గోదావరి వరద పెరుగుతున్నందున ముందుస్తు చర్యల్లో భాగంగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కొత్తగూడెం పట్టణంలో భారీ వర్షాలకు నీట మునిగిన ఇళ్లను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు పరిశీలించారు. బాధితులకు పునరావాసం కల్పించారు. రామవరంలో సింగరేణి విమెన్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.