
నమస్తే : వైద్యరంగంలో జిల్లా అభివృద్ధి ఏమిటి..?
పువ్వాడ : వైద్యరంగంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. భవిష్యత్లో ఖమ్మం జిల్లా కేంద్రంలోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
నమస్తే : జిల్లాలో పార్టీ అభివృద్ధికి ప్రణాళికలు ఏమిటి..?
పువ్వాడ : జిల్లా మంత్రిగా, పార్టీ నేతగా పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తా. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం నా విధి. నాకు లభించిన ప్రతి అవకాశాన్ని ప్రజలు, కార్యకర్తల కోసం వినియోగిస్తున్నా. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా. నాకు ప్రత్యేక వ్యక్తిగత ఇష్టాలేమీ ఉండవు. ప్రభుత్వ ఎజెండా అమలు చేయడం, జిల్లాలో పార్టీ జెండాను పటిష్టం చేయడమే నా కర్తవ్యం.
నమస్తే : జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి?
పువ్వాడ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నాలుగు మండలాలను దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. అందులో ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి అవకాశం కల్పించారు. చింతకాని మండలంతోపాటు దశలవారీగా అన్ని మండలాల్లో దళిత బంధును ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా ఎమ్మెల్యేలతోపాటు నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నా.
నమస్తే : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి ఎలా ఉంది..?
పువ్వాడ : అభివృద్ధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రగామిగా ఉంటోంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు రాష్ట్రస్థాయిలో మొదటి, మూడు స్థానాల్లో నిలిచాయి.
నమస్తే : జిల్లాలో సాధించిన అభివృద్ధి ఏమిటి..?
పువ్వాడ : జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించుకున్నాం. 250 పడకల ఆసుపత్రిని 550 పడకల ఆసుపత్రిగా మార్చాం. ఇందులో 350 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం.