గంగాధర, ఏప్రిల్ 4: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి రాజీవ్ యువవికాస పథకంలో కాంగ్రెస్ సర్కారు రోజుకో నిబంధన పెడుతున్నది. దరఖాస్తు దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. నిన్నటి వరకు ఇన్‌కం సర్టిఫికెట్ ఉంటేనే దరఖాస్తు చేసుకోవచ్చనే నిబంధనతో యువకులు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగారు.
తహసీల్ ఆఫీసుల్లో వందలాదిగా దరఖాస్తులు పేరుకుపోయి ఇబ్బంది పడ్డారు. మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఇన్‌కం సర్టిఫికెట్ నిబంధన ఎత్తివేయడంతో ఊరట చెందారు. కానీ, అంతలోనే బ్యాంకర్లు మరో కొత్త మెలిక పెట్టారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. సిబిల్ స్కోర్ 700 దాటితేనే లోన్ వస్తుందని చెబుతుండడంతో ఇదేక్కడి నిబంధన అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణానికి, సిబిల్ స్కోర్‌కు ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు.