Open gyms | మెట్ పల్లి రూరల్, జూన్ 20: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లను యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్ పల్లి మండలం వెల్లుల్లలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు నిధులు రూ. ఐదు లక్షలు, వేంపేటలో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్ లను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు.
శారీరక శ్రమ తగ్గడంతో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారని, అందుకే ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రతిరోజు వ్యాయామం చేసినప్పుడే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. అందుకే గ్రామాల్లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు వ్యాయామం చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ మారుసాయిరెడ్డి, బీఆర్ఎస్ మెట్ పల్లి మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు నారాయణ, అశోక్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.