Young voters | రామగిరి, డిసెంబర్ 11 : ‘హలో తమ్ముడు.. బాగున్నవా.. నేను మన ఊరు సర్పంచిగా పోటీ చేస్తున్న.. మీ నాయన నాకు బాగా దగ్గర. అన్ని విషయాలు మీ బాపుతో మాట్లాడిన.. ఎలాగైనా రేపు ఉదయం కల్లా ఊళ్లో ఉండాలి.. ఓటు వేసిన తర్వాత తీరిగ్గా వెళ్లిపోతువు గనీ.. ప్రయాణ ఖర్చులు నేను చూసుకుంట.. ఇక్కడకు వచ్చాక ఫోన్ చేస్తే బండి కూడా పంపిస్తా..’ అని దూర ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లను పిలిపించుకున్న అభ్యర్థులు తీరా వారిలో వణుకు పుట్టించారు. తమ గ్రామ సర్పంచి ఎన్నికల్లో ఓటు వేయాలన్న ఆసక్తితో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు పట్నాల నుంచి పల్లెలకు గురువారం ఉదయమే చేరుకున్నారు. వరంగల్, హైదరాబాద్, బెంగుళూరు తదితర నగరాల్లో ఉద్యోగ రీత్యా స్థిరపడిన యువతతోపాటు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థులను సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి కుటుంబ సభ్యుల సాయంతో పిలిపించుకున్నారు. వారికి అయ్యే ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామని మాట తీసుకున్నారు.
మండల కేంద్రంకు వచ్చాక గ్రామాలకు చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు సమకూరుస్తామని నమ్మకంగా చెప్పారు. రామగిరి మండలంలోని పలు గ్రామాలకు బేగంపేట ఎక్స్ రోడ్డు నుంచే ఏదో దొరికిన ప్రైవేటు వాహనం పట్టుకొని వెళ్లాలి. ఐతే దూర ప్రాంతాల నుంచి రాత్రి ఆర్టీసీ, రైళ్లలో బయలుదేరిన యువత గురువారం తెల్లవారకముందే బేగంపేటకు వచ్చారు. ఇక్కడ నుంచి తమ గ్రామాలకు వెళ్లాలంటే ఆ సమయంలో ఏలాంటి వాహనాలు లేకపోవడంతో వణుకుపుట్టే చలిలో నడిరోడ్డుపైనే గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అటు వాహనాలు పంపిస్తామని చెప్పిన అభ్యర్థులు చివరకు ఏలాగోలా ఇక్కడదాకా వచ్చినవారు కాసైపేత వాళ్లే ఊళ్లకు వస్తారని పట్టించుకోకపోవడంతో యువ ఓటర్లు చలిలో గంటలకొద్దీ ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత తమ బంధువులను పిలిపించుకొని ప్రైవేటు వాహనాల ద్వారా వాళ్లకు వెళ్లిపోయారు. ఈ దృశ్యంలో ‘నమస్తే’ క్లిక్ మనిపించింది.