Indiramma houses | తిమ్మాపూర్, జూన్28 : మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని తెలుసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డితో కలిసి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనుమతులు తీసుకొని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ చరిత్రలో లేదని, సిగ్గుచేటని రావుల రమేష్ అన్నారు. ఇప్పటినుండి తాము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
మేము తలుచుకుంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క నిరసన కూడా తెలిపేవారు కాదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 5500 అప్లికేషన్లు వస్తే గ్రామానికి 20, 30 ఇండ్లు ఇస్తే అర్హులు ఎప్పుడు పూర్తవుతారని ప్రశ్నించారు. తాము ఇండ్లు వచ్చిన వారి గురించి అడగడం లేదని ఇండ్లు రాని అర్హులైన పేదవారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గ్రామాల్లో అనేకమంది అర్హులను విస్మరించారన్నారు. వికలాంగులు, పంచాయతీ కార్మికులకు ప్రత్యేక కోటా ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. ఎక్కడ అమలు అవుతుందని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి ఉన్నదని మీరు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం తప్ప ఏమీ లేదని స్పష్టం చేశారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు.
రసమయి అవినీతి అని మాట్లాడే మీరు.. అవినీతి ఎక్కడ జరుగుతుందో నియోజకవర్గ ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. రసమయి బాలకిషన్ పై పిచ్చిపిచ్చి ఆరోపణలు, వాఖ్చలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వంతడుపుల సంపత్, పాశం అశోక్ రెడ్డి, పొన్నం అనిల్ గౌడ్, మాతాంగి లక్ష్మణ్, బోయిని తిరుపతి, కవంపల్లి పద్మ, కరివేద జనార్దన్ రెడ్డి, సుదగోని సదయ్య గౌడ్, ఖమ్మం కృష్ణ, గడ్డి రమేష్, దేవేందర్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.