తిమ్మాపూర్రూరల్/ మానకొండూర్రూరల్ ఫిబ్రవరి 18 : యాసంగి పొలాలు ప్రస్తుతం కలుపు దశలో ఉన్నాయి. రైతులు కలుపుతీత పనుల్లో బిజీగా ఉన్నారు. కలుపు తీసిన వెంటనే యూరియా వేస్తే పంట బాగా ఎదుగుతుంది. అయితే, ఇదే సమయంలో అధికారుల ప్రణాళికా లోపంతో యూరియా కొరత వేధిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా సహకార సంఘాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. తిమ్మాపూర్ మండలంలోని పోలంపల్లిలోని దుద్దెనపల్లి, మన్నెంపల్లిలోని పోరండ్ల, మానకొండూర్ మండలంలోని కొండపల్కల, గంగిపల్లి గ్రామాల్లోని ప్రాథమిక సహకార సంఘాలలో మంగళవారం యూరియా కోసం రైతులు ఉదయం 6 గంటల నుంచే బారులు తీరారు.
తిమ్మాపూర్ మండలంలోని సొసైటీలకు 230 చొప్పున బస్తాలు మాత్రమే రాగా, రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో సగం మందికే అందాయి. దీంతో చాలా మంది రైతులు నిరాశగా వెనుదిరిగారు. కొంతమంది రైతులు యూరియా కోసం సొసైటీల ఎదుట ఆందోళన చేశారు. గతంలో రైతులకు సరిపడా నిల్వలు ఉండేవని, ప్రస్తుతం యూరియా తెప్పించడంలో నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.