సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 6: సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ సినీ, గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ(76) శుక్రవారం అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. సిరిసిల్లలో అంత్యక్రియలు నిర్వహించారు.
జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీచౌరస్తాలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ప్రముఖ కవి జూకంటి జగన్నాథం, సాహితీవేత్తలు ఎలగొండ రవి, వాసరవేని పరశురాములు నివాళులర్పించారు. అలాగే సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ఆకునూరి శంకరయ్య, వెంగళ లక్ష్మణ్, ఆడెపు లక్ష్మణ్, గెంట్యాల ముత్తయ్య, సడిమెల ఎల్లయ్య, తదితరులు సానుభూతి వ్యక్తం చేశారు.
సాహిత్యంపై అభిరుచి..
సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో లక్ష్మమ్మ-లింగయ్య దంపతులకు 1948 ఆగస్టు 5న కృష్ణ జన్మించారు. సినారె స్ఫూర్తితో సాహిత్యంపై అభిరుచి ఏర్పరుచుకున్నారు. సాహిత్యం, పద్యాలపై మంచి పట్టు ఉండడంతో సినిమాలపై దృష్టిసారించారు. పిల్లజమీందార్ సినిమాలో ‘నీ చూపులోన విరజాజివాన.. అమృతకలశంలో సిగ్గాయె సిగ్గాయెరా..’ యుగకర్తలు సినిమాలో ‘తాగినోడి మాట..తందనాల వేదమాట’తోపాటు పలు చిత్రాల్లో పాటలకు రచనలు అందించారు. లలిత గీతాలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి.
1968లో స్రవంతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలతోపాటు కవికళ్యాణం, గడ్డిపువ్వు, గాంధీ, మూడు పువ్వులు, ఆరు కాయలు, సంక్రాంతి లక్ష్మీ, స్వదేశీయం, వివేకానంద విజయం, జయజయహే తెలంగాణ, రమణీయ రామప్పతో పాటు అనేక సంగీత రూపకాలు రాశారు. అలాగే ఎక్కడికెళ్తుందో మనసు, లావణ్య విత్ లవ్ బాయ్స్ చిత్రాలకు రచన, దర్శకత్వం వహించారు. బతుకమ్మ, రామప్ప రమణీయం లఘు చిత్రాలకు నంది పురస్కారాలు అందుకున్నారు. 10వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్డీ పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన బలగం సినిమాలో నటించారు. కాగా, వడ్డేపల్లి కృష్ణకు భార్య మణెమ్మ, ఇద్దరు కొడుకులు శ్రీనాథ్, శ్రీకాంత్, కూతురు వాణి ఉన్నారు.
వడ్డేపల్లి కృష్ణ మృతి బాధాకరం : కేటీఆర్
సినీ గేయరచయిత వడ్డేపల్లి కృష్ణ మరణ వార్త ఎంతో బాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన చెందారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, రచయితగా, పరిశోధకుడిగా దర్శకుడిగా పలు రంగాల్లో తనకంటూ అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారని కొనియాడారు. సాహిత్యరంగంలో వడ్డేపల్లి కృష్ణ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.