జగిత్యాల, డిసెంబర్ 20: జిల్లాలో ఇంజినీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఈఈ, డీఈ, ఏఈలతో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాం టి అక్రమాలకు తావులేకుండా ఉండాలని సూచించా రు. ప్రతి పనిలో నాణ్యతను పంచాయతీరాజ్ డీఈ, ఏఈ స్వయంగా వెళ్లి పరిశీలించాలన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా జనవరి చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతకు మారుపేరుగా జగిత్యాల పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పని చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రఘువరణ్, పంచాయతీరాజ్ ఈఈ రహమాన్, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలోని జ్యోతి హైస్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఇటీవల గోదావరిఖనిలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి సెస్టో బాల్ ఎంపిక పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు పంజాబ్‌లోని దూరి జిల్లాలో జరిగిన 2వ సబ్ జూనియ ర్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు భానువర్ష, మధుకీర్తన, ప్రీతం కృష్ణను ఆమె అభినందించారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ, విద్యార్థు లు జాతీయ స్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రఘువరణ్, జడ్పీటీసీ నాగం భూమయ్య, పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు, మౌనికారావు, అజిత, రజిత, పీఈటీలు గౌతమ్, సుభాష్, నిఖిల్ పాల్గొన్నారు.
జగిత్యాల, డిసెంబర్ 20: జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత-సురేశ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు జడ్పీ చైర్పర్సన్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి స్వామి వారి శేషవస్త్రంతో సతరించి సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు బండారి లక్ష్మీ నారాయణ, మానాల కిషన్, నీలం దశరథ్ రెడ్డి, అల్లాల ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.