Ramagundam Baldia | కోల్ సిటీ, నవంబర్ 27: రామగుండం నగర పాలక సంస్థలో మహిళా కార్మికుల ప్రక్షాళన చర్యలు ఆందోళనకు దారితీస్తోంది. నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలతో 11 మంది మహిళా కార్మికులను ఉన్నపలంగా తోటమాలి పనుల నుంచి తొలగించారు. వారిని శానిటేషన్ విభాగంకు బదలాయించి నగరంలోని ఆయా డివిజన్లలో క్షేత్ర పనులు అప్పగించడంతో సదరు మహిళా కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. వయోభారంతో ఆ పనులు చేయడం ఇబ్బందిగా ఉంటుందని గురువారం అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
ఈమేరకు కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంఏ గౌస్ నగర పాలక సంస్థ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్‌తో జరిపిన చర్చల వల్ల కూడా ఏలాంటి ప్రయోజనం కనిపించలేదు. కమిషనర్ ఆదేశాల మేరకు శానిటేషన్ విభాగంనకు బదలాయించక తప్పడం లేదని అడిషనల్ కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో మహిళా కార్మికులు కార్యాలయంలో గంటల పాటు అధికారులకు తమను తొలగించవద్దని ఏకరువు పెట్టుకున్నా కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు.
కాగా, గత 25 యేళ్లుగా రామగుండం కార్పొరేషన్ పరిధి ఉద్యాన వనాల్లో తోటమాలి పనులు చేస్తూ వస్తున్న 16 మంది కార్మికులను ఆ విభాగం నుంచి అర్ధాంతరంగా ప్రక్షాళన చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని పలువురు కార్మికులు, కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిలో ఐదుగురు కార్మికులను మాత్రం అధికారులు తమకు అనుకూలంగా డ్యూటీలు మార్చి మిగతా 11 మంది కార్మికుల విషయంలో వ్యత్యాసం ప్రదర్శించి శానిటేషన్ విభాగంకు బలవంతంగా మార్చడం వల్ల కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.