వీణవంక, అక్టోబర్ 16 : ఏండ్లనాటి బ్రిడ్జి నిర్మాణం కల నెరవేరుతుందని.. తమ వెతలు తీరుతాయని ఆశపడ్డ ఐదు గ్రామాల ప్రజలకు నిరాశే మిగులుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరైనా పనుల పూర్తిపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. వీణవంక మండలంలోని కనపర్తి గ్రామం మండల కేంద్రానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఈ గ్రామం నుంచి వీణవంకకు వెళ్లే రోడ్డు పరిస్థితి దారుణంగా మారుతున్నది. గ్రామ శివారులో పైన ఉన్న బేతిగల్ ఊరచెరువు నుంచి బంధంకుంటకు ప్రవహించే వరద తాకిడికి తెగిపోతున్నది.
ఈ రోడ్డుపై రాకపోకలు నిలిచి, కనపర్తితోపాటు శంకరపట్నం మండలం కల్వల, గద్దపాక, వీణవంక మండలం బేతిగల్, వీణవంక గ్రామస్తులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇలాంటి సమయాల్లో మండల కేంద్రానికి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ సమస్యను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, 2023లో బ్రిడ్జి నిర్మాణానికి 1.25 కోట్లు, రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 2.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే, తర్వాత ప్రభుత్వం మారడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.
వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
ఎన్నో ఏండ్ల సంది బ్రిడ్జి లేక మా ఊరోళ్లం ఇబ్బందులు పడుతున్నం. వరద వచ్చినప్పుడల్లా మండల కేంద్రానికి రాకపోకలు బంద్ అయితున్నయి. వ్యవసాయ భూములు, పంటలు దెబ్బతింటున్నయి. మా బాధలను చూసి గత బీఆర్ఎస్ సర్కారు బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చింది. కానీ, ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. మా బాధలు అర్థం చేసుకొని వెంటనే బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి.
– పర్లపెల్లి తిరుపతి (కనపర్తి)