Karimnagar Crime | రాంనగర్, ఫిబ్రవరి 12: కరీంనగర్ నగర పరిధిలోని సాయినగర్‌లో ఇంటి పెద్ద మనిషికి సపర్యలు చేసేందుకు నియమించుకున్న కేర్ టైగర్ దొంగగా మారాడు. యజమాని దైవదర్శనానికి వెళ్లడం తనకు సరైన సమయంగా భావించి ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో పరారయ్యేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్‌లోని సాయి నగర్ వాసి రావికంటి అఖిల్ ఈనెల తొమ్మిదో తేదీన కుటుంబంతో సహా తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళాడు.
12 ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు వేసినట్టే ఉండగా చిల్డ్రన్ బెడ్ రూమ్ కిటికీ గ్రిల్ లేకపోవడం గమనించాడు. ఆ కిటికీ గ్రిల్ నుంచిచొరబడిన అగంతకుడు లాకర్లో ఉన్న బంగారం నగదు అపహరించాడు. వెంటనే అప్రమత్తమైన అఖిల్ తన కుటుంబ సభ్యులకు విషయం వివరించి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
తన తండ్రికి కేర్ టేకర్‌గా ఉన్న బెజ్జంకి సంతోశ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని అఖిల్ తన ఫిర్యాదులో పేర్కొనడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతని వద్ద నుండి 98 గ్రాముల బంగారం, నగదు రికవరీ చేశారు. పట్టుబడిన నిందితుడిని టౌన్ ఏసీపీ వెంకట్ స్వామి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి తెలిపారు.