స్వయంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీయే పత్తాలేకుండా పోయింది. ఎల్లంపల్లి నిర్వాసిత యువతకు ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తున్నానని ప్రకటించి పదకొండు నెలలైనా పరిహారం అందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలోనే డబ్బులు పీడీ అకౌంట్లో జమై ఉన్నా, ప్రస్తుత ప్రభుత్వం మంజూరు ఇవ్వకపోవడం, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఆగిపోయినట్టు తెలుస్తుండగా. ఏడు గ్రామాల యువతీ యువకుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి, జూలై 8 (నమస్తే తెలంగాణ): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు ఇంకా పరిహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లిలో నిర్మించిన ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలను ఆశించి 2004లో గోదావరి నదిపై నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఇటు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం మండలం, అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట పరిధిలోని దాదాపు 7వేల ఎకరాల వ్యవసాయ భూములు, ఇండ్ల స్థలాలను సేకరించారు.
భూసేకరణ ఇతర పనులన్నీ పూర్తి చేసుకొని 2016వరకు నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన నాలుగో అతిపెద్ద ప్రాజెక్టు కాగా, దీని సామర్థ్యం 20టీఎంసీలు. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా మార్చారు. కాళేశ్వరం పనులు పూర్తి చేస్తున్న సమయంలోనే అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మిగిలి ఉన్న భూసేకరణకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, సింగరేణి సంస్థ భూసేకరణకు సంబంధించి 2017లో ప్రత్యేక చట్టాన్ని తెచ్చారు. ల్యాండ్ ఆక్విజేషన్ సమయంలో నిర్వాసిత కుటుంబంలో 18ఏళ్లు నిండిన యువతీ యువకులు ఉంటే వారికి 2లక్షల చొప్పున జీవన భృతి కోసం ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలని నిర్ణయించారు. ఎల్లంపల్లి నిర్వాసిత కుటుంబాల్లోని యువతకూ చెల్లించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో నిర్వాసిత గ్రామాలైన అప్పటి రామగుండం మండలం నేటి అంతర్గాం మండలం ముర్మూరు, ఎల్లంపల్లి, పొట్యాల, మద్దిర్యాల, ఉండెడ, పాలకుర్తి మండలం కుక్కల గూడూరు, వేంనూర్ గ్రామాల్లో సర్వే చేపట్టారు. 2015 జనవరి 1 వరకు 18ఏళ్లు నిండిన వారు 1,116 మంది ఉన్నట్టు గుర్తించారు. ఒక్కొక్కరికి 2లక్షల చొప్పున మొత్తంగా 22కోట్ల 32లక్షలు పంపిణీ చేయాలని నిర్ణయించి, 2023లో ఫైల్ సిద్ధం చేశారు. నిధులు మంజూరు చేశారు. తీరా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంపిణీకి బ్రేక్ పడింది. అయితే ఇదే ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లాలో యువతకు జీవో ఎంఎస్ నంబర్ 1ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది క్రితమే 2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను అందజేయగా, పెద్దపల్లి జిల్లాలోని మాత్రం ఇవ్వలేదు.
డిప్యూటీ సీఎం ప్రకటించినా పత్తాలేదు
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గతేడాది ఆగస్టులో రామగుండంలో పర్యటించారు. ఎల్లంపల్లి నిర్వాసిత యువకులకు ఎక్స్గ్రేషియా చెల్లించాల్సి ఉందని స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కోరగా, వెంటనే మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. ఇది జరిగి పదకొండు నెలలు పూర్తయినా పరిహారం పత్తా లేకపోవడంతో ఆయా గ్రామాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. పీడీ అకౌంట్లో గత ప్రభుత్వ హయాంలోనే డబ్బులు జమై ఉన్నాయి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మంజూరు ఇవ్వకపోవడం, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఆ డబ్బులు పీడీ అకౌంట్లోనే మూలుగుతున్నాయి. అయినా ఎవరూ స్పందించకపోవడంపై ఏడు గ్రామాల యువతీ యువకు లు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఆర్థిక మంత్రి హామీ ఇచ్చినా దిక్కులేదని వాపోతున్నారు.
పైసలస్తే ఆటో కొందామనుకుంటున్న
మాది పొట్యాల. నాన్న ఆరోగ్యం బాగా లేదు. చేతిల పైసలు లెవ్వు. గీ ఎక్స్గ్రేషియా పైసలు అత్తెనన్న ఒక సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కొని బతుకుదామంటే అవి అస్తలెవ్వు. అధికారులు కొంచెం డబ్బులు అచ్చేటట్టు చూడాలే.
– ఉప్పులేటి రోహిత్, పొట్యాల (అంతర్గాం మండలం)
పైసలు రాలేదు
మా ఊరు పోయి పదేండ్లు అయ్యింది. పైసలు వస్తయన్నారు. కానీ రావడం లేదు. చెక్కులిస్తమన్నారు. ఇంకా ఇస్తలేరు. ఇచ్చినట్టే చేసుడుగానీ ఇచ్చుడు లేదు. పైసలిస్తే దేనికన్నా ఉపయోగపడుతయ్ కదా.
-కూనారపు అనిత, వేంనూర్
(పాలకుర్తి మండలం)