Karimnagar | కలెక్టరేట్, మార్చి 22 : ఎలాంటి అనుమతుల్లేకుండా కొనసాగుతూ కలుషిత వాతావరణానికి కారణమవుతున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవటంలో తాత్సారమెందుకు చేస్తున్నారో చెప్పాలని, పర్యావరణ ఉద్యమకారుడు క్యాదాసి ప్రభాకర్ ప్రశ్నించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న అక్రమ బట్టీలపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మాట్లాడుతూ.. ఇటుక బట్టీల నిర్వహణతో కలుగుతున్న వాతావరణ కాలుష్యంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా కనీస పట్టింపు లేదని వాపోయారు. ఇటుక బట్టీల యజమానుల నిర్వాకంతో వ్యవసాయ పంటలు కూడా ద్వంసమవుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా బట్టీలు నిర్వహిస్తున్నా. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలన్నారు. మండలంలోని కమాన్‌పూర్ గ్రామ పరిధిలో గల ప్రభుత్వ భూమిలో ఇష్టారాజ్యంగా బట్టీలు నడుపుతుండగా, సమీపంలోని పలు కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారని అన్నారు.
ఈదురు గాలులకు బూడిద ఇళ్ళలోని నీటిపై పడుతుండగా, అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఇప్పటివరకు పదిసార్లు ఫిర్యాదు చేశామని, ప్రజావాణిలో సైతం బాధితులతో కలిసి వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయగా, పరిష్కరించాలని ఆదేశించినా, చర్యల్లేవన్నారు. కలెక్టర్ సత్వరమే స్పందించి ఇటుక బట్టీల నిర్వాహకులపై కొరడా ఝలిపించాలని కోరారు.