కార్పొరేషన్, నవంబర్ 30: నగరంలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించిన తర్వాతే స్వచ్ఛ ఆటోల్లో తరలించాలని కమిషనర్ యాదగిరిరావు అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని పలు డివిజన్లలో పర్యటించి పనులను తనిఖీ చేశారు. తడి,పొడి చెత్తను వేర్వేరుగా తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి,పొడి చెత్తను కలిపి ఆటోలో తరలించడం సరికాదని తెలిపారు. అక్కడికక్కడే తడి, పొడి చెత్తను వేరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ ఆటో కార్మికులు నగర వ్యాప్తంగా డివిజన్ల వారీగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. తడి, చెత్త పొడి చెత్తను కార్పొరేషన్వారు పంపిణీ చేసిన డబ్బాల్లో వేసి ఆటోలో లోడింగ్ చేయాలని ఇంటి యజమానులకు సూచించారు. చెత్తను వేరు చేయకుంటే ఎట్టి పరిస్థితిలో సేకరించరని స్పష్టం చేశారు. చెత్తను వేరు చేసి అందించేలా ఆయా ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. నగర స్వచ్ఛతకు ప్రతి ఒకరూ కృషి చేయాలని కోరారు. ప్రతి స్వచ్ఛ ఆటోలో తడి,పొడి చెత్త కోసం పార్టిషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. తడి చెత్తను వర్మీ కంపోస్టుకు, పొడి చెత్తలోని అట్టముకలు, డబ్బాలు డీఆర్సీసీ కేంద్రానికి, మిగిలిన చెత్తను డంపు యార్డుకు తరలించాలని సూచించారు. పారిశుధ్య తనిఖీలో చెత్త వేరు చేయకుండా తీసుకెళ్తే సంబంధిత కార్మికులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర వ్యాప్తంగా 100 శాతం వేర్వేరుగా చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య సిబ్బంది శ్రీధర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.