బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతన్నలకు నిరాశే మిగిలింది. ఉపాధి లేక బతుకులు ఆగమైన కార్మికులకు సర్కారు ఆపన్నహస్తం అందిస్తుందనుకుంటే మొండిచేయే ఇచ్చింది. నాడు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో చేనేత, మరమగ్గాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 1200 కోట్లు కేటాయిస్తే.. నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 371కోట్లే కేటాయించి చిన్నచూపు చూసింది. వ్యవసాయం తర్వాత కీలకమైన వస్త్రపరిశ్రమకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రపంచ చరిత్రను తిరగరాస్తూ కార్మికుడిని యజమానిగా మార్చాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వర్కర్‌టూ ఓనర్ పథకంపై కనీసం ఊసెత్తలేదు. కార్మికుడికి రూ.లక్ష రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేదు. వస్త్ర పరిశ్రమపై కాంగ్రెస్ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై నేతనల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ అరకొర నిధులతో పెద్దగా ప్రయోజనం ఉండదని, అవి ఏ మూలకూ సరిపోవనే అభిప్రాయం వెల్లడవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి ఉపాధి నిస్తున్నది వస్త్ర పరిశ్రమ. అలాంటి వస్త్ర పరిశ్రమ 2014కి ముందు ఉమ్మడి కాంగ్రెస్ సర్కారు హయాంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. వందలాది మంది కార్మికులు ఆకలిచావులు, ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారింది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి కేసీఆర్ ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకున్నది. చేనేత, మరమగ్గాలు వేర్వేరుగా ఉన్న పరిశ్రమలో ఎదురవుతున్న ఇబ్బందులు, నేతన్నల సమస్యలు పరిష్కరించాలన్న ఉద్ధేశ్యంతో చేనేత, మరమగ్గాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది.
తెలంగాణ పవర్‌లూం టెక్స్టైల్ డెవలప్మెంట్ లిమిటెడ్ కార్పొరేషన్‌కు సిరిసిల్ల నేత కుటుంబానికి చెందిన గూడూరి ప్రవీణ్‌ను చైర్మన్‌గా నియమించింది. చేనేత, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధితో పాటు నేతన్నల సంక్షేమం కోసం త్రిప్ట్, నేతన్నకు బీమా, రూ.లక్ష రుణమాఫీ, యారన్ సబ్సిడీ, పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎనిమిది నెలల పాటు నిరంతరం ఉపాధినిచ్చే బతుకమ్మ చీరలతో వారి బతుకులకు భరోసా కల్పించింది. అందుకోసం ఆనాడు బడ్జెట్లో 1200 కోట్లు కేటాయించింది. నాటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలతో చేనేత, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి పరుగులు పెట్టింది. కార్మికులకు చేతినిండా పనితో ఉరిసిల్లను ‘సిరి’సిల్లగా మార్చింది.
నేడు కేవలం 371కోట్లే
కేసీఆర్ ప్రభుత్వం నేతన్నను కడుపులో పెట్టుకుని చూసుకున్నది. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. బడ్జెట్లో నాడు 1200 కోట్లు కేటాయిస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 371కోట్లు కేటాయించింది. ప్రతి బడ్జెట్లో నిధుల కేటాయింపు పెరుగుతూ వస్తుందనుకున్న నేతన్నల ఆశలు ఆవిరయ్యాయి. గత ప్రభుత్వం కన్నా అద్భుతంగా బడ్జెట్ ఉంటుందని భావిస్తే సర్కారు రిక్తహస్తం చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం పథకాలు యథాతథంగా కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎక్కువ ఉండాలి. కానీ, అరకొర నిధులతో పథకాలు అమలు కావడం అనుమానంగానే ఉన్నది. మహిళా సంఘాలకు ఇచ్చే చీరలకు సుమారు 500 కోట్లు అవసరం ఉంది. ఇక విద్యుత్ సబ్సిడీకి, వర్కర్‌టూ ఓనర్ పథకం ఇలా అనేక పథకాలు అమలు చేయాలంటే కనీసం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాల్సి ఉంటుంది. ఇంత తక్కువ మొత్తంలో బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రభుత్వం నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పిస్తుందా..? వారి బతుకులకు భరోసా నిస్తుందా..? అన్న సందేహాలను కార్మిక కుటుంబాలు వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తావన లేని వర్కర్‌టూ పథకం
ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా కార్మికుడు కార్మికుడుగానే మిగిలిపోతున్నాడు. కార్మికుడే యజమాని అయితే వారి బతుకులు బాగుపడుతాయన్న ఉద్ధేశ్యంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 350కోట్ల వ్యయంతో వర్కర్ టూ ఓనర్ పథకం ప్రవేశపెట్టారు. అందుకు అప్పారెల్ పార్కులో వర్క్షెడ్లను నిర్మించారు. మొదటి దశలో 1140 మందికి సబ్సిడీపై వర్క్షెడ్లు, సాంచాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం మారడంతో పెండింగ్‌లో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచింది.
వర్కర్‌టూ ఓనర్ పథకాన్ని ప్రారంభించి తమను యజమానులను చేస్తుందన్న నేతన్నల కలలు కల్లలై పోయాయి. ఈ పథకం అమలు చేయాలని కార్మిక సంఘాలు పలుసార్లు మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. హామీలే తప్ప అమలు చేసిన పాపాన పోలేదు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో వర్కర్ టూ ఓనర్ పథకం ఊసెత్తలేదు. అసలే తీవ్ర సంక్షోభంలో సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కు కూరుకుపోయింది. అందులోని చాలా యూనిట్లు మూతపడి పోయాయి. కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. సిరిసిల్ల పరిశ్రమ సంక్షోభం కారణంగా ఇప్పటికే చాలా మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోగా, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కనీసం సాయం అందించేవారు లేక ఆగమవుతున్నాయి.
లక్ష రుణమాఫీ హామీలకే పరిమితం
నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయనుకుంటే.. ప్రస్తుతం చూస్తే ఇంకా దయనీయంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పద్మశాలీ జాతీయ సదస్సులో నేతన్నల సమస్యలను నేతలంతా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుల నుంచి నేతన్నలను విముక్తి చేయాలంటూ మొరపెట్టుకున్నారు. అందుకు స్పందించిన సీఎం లక్ష రుణమాఫీ చేస్తానని హామీలిచ్చారు. ఇచ్చిన హామినీ బడ్జెట్లో ప్రస్తావించక పోవడంపై నేతన్నలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. బయట అప్పులు పుట్టక మైక్రో ఫైనాన్స్‌ల ఉచ్చులో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరుతుందా.. లేదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఏమైనా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేత కుటుంబాలు, వస్త్ర పరిశ్రమపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.
2వేల కోట్లు కేటాయించాలి
చేనేత, పవర్‌లూం రంగానికి బడ్జెట్లో రెండువేల కోట్లు కేటాయించాలి. ఈ విషయమై మా యూనియన్ ద్వారా పలుసార్లు మంత్రులు, సీఎంకు వినతి పత్రాలు సమర్పించాం. నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం పథకాలు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశాం. అయినా సర్కారు నేతన్నలను విస్మరించింది. బడ్జెట్లో 371కోట్లు మాత్రమే కేటాయించింది. వాటితో యారన్, విద్యుత్ సబ్సిడీలు, పింఛన్లు, చీరల పథకాలు ఎలా కొనసాగిస్తుంది? బడ్జెట్లో నేతన్నలకు పూర్తిగా అన్యాయం జరిగింది. ప్రభుత్వం పునరాలోచించాలి.
– మూషం రమేశ్, తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు
వివక్ష చూపుతున్నది
ప్రభుత్వం ముమ్మాటీకి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నది. కాంగ్రెస్ ఎన్నికల ముందు నేతన్నలకు ఏదో చేస్తామని ఎన్నో హామీలు గుప్పించింది. స్వయం సహాయక మహిళలకు రెండు ఇచ్చే రెండు చీరలు సిరిసిల్లలోనే తయారీ చేసి చేతి నిండా పనికల్పిస్తామని చెప్పింది. కానీ, చీరల తయారీకే 500 కోట్లు అయ్యాయి. అలాంటి బడ్జెట్లో 371కోట్ల కేటాయిస్తే ఏం ప్రయోజనం? సంక్షేమ పథకాలు అమలు ఎలా చేస్తరు? చేనేత పరిశ్రమపై, నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. నిధులు కేటాయించిన తీరు నేతన్నలపై పక్షపాతం చూపినట్టు ఉన్నది.
– పంతం రవి, సీపీఐ పవర్‌లూం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి (సిరిసిల్ల)
మోచేతికి బెల్లం పెట్టిన్రు?
ఏండ్ల సంది సాంచాల మీదనే ఎల్లదీత్తన్నం. పెద్దసారు కేసీఆర్ దయవల్ల బతుకమ్మ చీరలు ఇచ్చి మాకు పని కల్పించిండు. ఒక్కటారెండా.. ఎన్నో పథకాలు పెట్టిండు. యారన్ సబ్సిడీ, పింఛన్లు ఇచ్చిండు. ఆరేడేళ్లు చేతినిండా పనితో నెలకు 20వేలు పగారచ్చేలా చేసిండు. భార్యా పిల్లలతో ఉన్న ఊళ్లో బతికినోళ్లం. కాంగ్రెస్ అచ్చినంక గింత పనైతదనుకోలేదు. బడ్జెట్లో ఏదో మాకు మేలైతదని ఆశపడ్డం. కానీ, మోచేతికి బెల్లం పెట్టిన్రు? అంతే తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.
– గెరిట్యాల విజయ్, నేత కార్మికుడు
వస్త్ర పరిశ్రమకు ఒరిగేదేమీ లేదు
వ్యవసాయం తర్వాత లక్షల మందికి జీవోనోపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ. అలాంటి పరిశ్రమకు 371కోట్లు కేటాయించడం అన్యాయం. కొద్ది నిధుల వల్ల పరిశ్రమకు ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వం నేతన్నలను చిన్నచూపు చూసింది. నేతన్నలకు రుణమాఫీ, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం, ఆటో డ్రైవర్లకు భృతి ఏమైంది? నేతన్నలకు ఉపాధి కల్పించి, వస్త్ర పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదే.
– అల్లాడి రమేశ్, సెస్ మాజీ చైర్మన్