Orphaned children | పెద్దపల్లి, మే8: జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వారి సంరక్షకులతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల ఉన్నత చదువులు, అవకాశాలుపై వ్యక్తిగత అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అనాథలమనే భావన నుంచి బయటి వచ్చి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వచ్చిన అవకాశాలతో అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. మీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే 1098కి ఫోన్ చేసి చెపితే తమ సిబ్బంది వెంటనే స్పందిస్తారని తెలిపారు. ప్రతీ నిత్యం ఐసీపీఎస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం పిల్లల కోసం ప్రతి నెల రూ.4 వేలు అందిస్తుందని, పిల్లల సంరక్షకులు, పిల్లలు రక్త సంబంధీకులు వారిని సొంత బిడ్డలతో సమానంగా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్, జితేందర్, కనకరాజు, రజిత, అనిల్ తదితరులు పాల్గొన్నారు.