Chada Venkata Reddy | కోరుట్ల, ఆగస్టు 14: సీపీఐ ప్రజల పక్షాన ఆలుపెరుగని పోరాటం చేస్తుందని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో సీపీఐ పార్టీ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొనీ జిల్లాలో జైత్రయాత్ర మాదిరిగా ఎర్రజెండాలతో ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. పార్టీ చరిత్రను పల్లె పల్లెకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈనెల 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విదానాలను, కార్మిక, ప్రజా రైతు సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు.
భవిష్యత్తు పోరాటాలకు నాందిగా మహాసభలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామన్నారు. అనంతరం జిల్లా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా చెన్న విశ్వనాధం, సహయ కార్యదర్శిగా ఇరుగురాల భూమేశ్వర్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా వెన్న సురేష్, సుతారి రాములు, ఎండి ముక్రం, మునుగూరి హన్మంతు, కొక్కుల శాంత, ఎన్నం రాధా, వెన్న మహేష్, ఎర్దండి భూమయ్య, ఉస్మాన్ అక్రమ్ పాషా, శనిగారపు ప్రవీణ్, మహమ్మద్ మౌలానా, మల్లాపూర్ రాజన్నలను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని వెంకటరెడ్డితో పాటూ నాయకులు రాష్ట్ర నాయకులు కలవేని శంకర్ అభినందించారు. ఈమేరకు చాడ వెంకటరెడ్డిని సత్కరించిన జిల్లా నాయకులు మినట్ బుక్‌ను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.