Ramagundam | కోల్ సిటీ, జనవరి 5: రామగుండం కార్పొరేషన్ ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా కార్యాలయంలో సమర్పిస్తే పరిశీలిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. నగర పాలక కార్యాలయంలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాపై అభిప్రాయాల స్వీకరణకు సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మరణించిన ఓటర్లు, రెండు చోట్ల నమోదు కాబడిన ఓటర్లు, శాశ్వతంగా వలసపోయిన ఓటర్ల వివరాలు లిఖిత పూర్వకంగా అందజేస్తే సవరణ నిమిత్తం తహసీల్దార్ కార్యాలయం దృష్టికి తీసుకవెళ్తామని తెలిపారు.
2025 అక్టోబర్ 1 నాటికి ఓటరుగా నమోదైన వారిని ఎపిక్ ఐడీలో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఆయా డివిజన్ ఓటరు జాబితాలో చేర్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తామని చెప్పారు. ఈ ముసాయిదాకు సంబంధించి ఈనెల 9 వరకు స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి 10వ తేదీన తుది జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఒక్కో పోలింగ్ బూతు 800 ఓట్లు ప్రాతిపదికగా ఇంటి నుంచి 2 కి.మీ దూరం లోపు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీహరి, టీపీఎస్ నవీన్, ఆర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.