Uttam Kumar Reddy | ధర్మారం, ఆగస్టు 3: గోదావరి నదిపై అనుసంధానంగా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించే తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అడ్డుకొని తీరుతుందని రాష్ట్రా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించారు.
స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు రూ.45.1 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి నదికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన వెల్లడించారు. తాను సిడబ్ల్యుసి కి లేఖ రాయడంతో కేంద్ర ప్రభుత్వం అట్టి ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం తెలిపిందని ఆయన తెలిపారు.
అదేవిధంగా ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి హాజరుకాగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తాను ఆ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పామని ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ఎంతటి పోరాటానికైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు. రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన వినతి మేరకు స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి రిజర్వాయర్ నిర్మాణం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం డి పి ఆర్ తయారు చేయడానికి రూ. 1కోటి 10 లక్షల నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
అదేవిధంగా ఈ ప్రాజెక్టు పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు తాను ఇట్టి రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధుల కేటాయింపు కోసం కృషి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా అర్ధాంతరంగ నిలిచిన నంది రిజర్వాయర్ లింక్ కాలువ నిర్మాణానికి రూ.3.26 కోట్లు, కొత్తపల్లి గ్రామానికి ఎస్సారెస్పీ డి 83/బి 1ఎల్ కాలువ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిన నేపథ్యంలో భూసేకరణ కోసం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. యశ్వంతరావు పేట చెరువు పూడిక తొలగించడం, అక్కేపల్లి లిఫ్ట్ పూర్తి చేయించడం, గోదావరి నదికి అనుసంధానం ఉన్న 6 లిఫ్టుల మరమ్మ కోసం రూ.82 లక్షల కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపడుతాం : మంత్రి లక్ష్మణ్‌కుమార్
రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల ఉపాధి అవకాశాల కోసం ధర్మారం మండలానికి ఐటిఐ కళాశాల మంజూరు చేయించడంతోపాటు భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.45.15 కోట్ల నిధులను మంజూరు చేయించడం ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం డిపిఆర్ తయారు చేయడానికి ప్రభుత్వం చేయడం హర్షనీయమని అన్నారు. తన పదవి కాలంలో మండలంలో అనేక అభివృద్ధి పనులు చేస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయిల్ఫామ్ తోటల సాగు పెంచాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నీటి అవసరం ఎక్కువగా ఉన్న వరి,పత్తి, మిర్చి సాగును రైతులు తగ్గించడమే శ్రేయస్కరమని అన్నారు. నీటి అవసరం తక్కువగా ఉన్న ఆయిల్ పామ్ తోటలు సాగు చేసి ఆర్థికంగా రైతులు ఎదగాలని అన్నారు. తాను కూడా ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నానని ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నెలకొల్పుతామని తదనంతరం జిల్లాకు ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. : మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మహాలక్ష్మి పథకం లో భాగంగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించామని అన్నారు. అదేవిధంగా తమ ప్రభుత్వం గురుకులాలు, వసతి గృహాలు నివాసం ఉండే విద్యార్థుల మెస్ చార్జీలను పెంచిందని, గృహ జ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్, అడిషనల్ కలెక్టర్ వేణు, డీసీఎస్ఓ శ్రీనివాస్, డీపీవో వీర బుచ్చయ్య, ఐటీఐ ఆర్డీడీ సీతారాం , పెద్దపల్లి ఐటిఐ కళాశాల కన్వీనర్ బి. వెంకట్ రెడ్డి, ఎంపీడీవో అయినాల ప్రవీణ్ కుమార్, ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.