Better services | వీణవంక, ఆగస్టు 7: విద్యుత్ సిబ్బంది అలసత్వాన్ని వీడి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల చైర్మన్ ఎన్వీ వేణుగోపాల చారి సూచించారు. మండలంలోని ఎలుబాక సబ్‌స్టేషన్ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులు వారి సమస్యలు అధికారులకు తెలియజేశారు. ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ ఎనగంటి విజయ-శ్రీనివాస్ గ్రామంలో ప్రతీ చిన్నవానకు, గాలికి కరెంట్ పోతుందని, చల్లూరు టౌన్ లైన్‌కు కలిపి విద్యుత్ అంతరాయం సమస్యను పరిష్కరించాలని కోరారు.
బొంతుపల్లికి మంజూరైన సబ్ స్టేషను వెంటనే ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరారు. అనంతరం చైర్పర్సన్ వేణుగోపాలచారి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు సమస్య ఉన్నదని తెలిపిన వెంటనే వెళ్లి పరిష్కరించాలని, లేకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. సమాచారం అందిన వెంటనే క్షేత్రస్థాయిలో వెళ్లి పరిష్కరించడానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ మెంబర్ దేవెందర్, టెక్నికల్ మెంబర్, రమేష్, మెంబర్ ఇండిపెండెంట్ రామారావు, డీఈ లక్ష్మారెడ్డి, ఎస్ఏఓ రాజేంద్రప్రసాద్, ఏఈలు శ్రీనివాస్, సరేశ్వరాచారి, జూనియర్ లైన్మెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.