Godavarikhani | కోల్ సిటీ, జనవరి 5: అంధ వికలాంగులకు చేయూత అందించి వారి విధిరాత మారుద్దామని ఐ.ఏ.ఎస్ విద్యా సంస్థల డైరెక్టర్ పేరం హేమలత శ్రీకాంత్ అన్నారు. గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల ఇండో అమెరికన్ లో హైదరాబాద్ కు చెందిన ఎస్ఓసీహెచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధ వికలాంగులకు సోమవారం చేయూత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యతిథిగా హాజరై మాట్లాడుతూ విధి వంచితులైన అంధ వికలాంగులు తమ దినచర్యలను చేసుకోవడంలో ప్రతీ నిత్యం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటారనీ, అలాంటి అధులకు చేయి చేయి కలిపి చేయూత ఇద్దామని సూచించారు.
విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సామాజిక సేవా దృక్పథంను అలవర్చుకోవడం వల్ల భవిష్యత్లో ఉన్నత వ్యక్తిత్వంతో గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లాక తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అంధులకు ఆర్ధిక సహకారం అందించడంలో భాగస్వాములను చేయాలని సూచించారు. సమాజసేవ, క్రమశిక్షణ వైపు నడిపిస్తుందన్నారు.
ఎస్ఓసీహెచ్ సంస్థ ప్రతినిధులు కూడా ఒకప్పుడు విద్యార్థులేననీ, ఆ స్థాయి నుంచే సమాజ సేవకులుగా ఎదిగారని, అంధుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆ సంస్థకు మనమంతా సహకారం అందిద్దామని పిల్లలచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్ఓ సీహెచ్ ప్రతినిధులు నితిష్ రెడ్డి, రేణుక, ఉపాధ్యాయులు శివ, సునీత, స్వరూపతోపాటు అధిక సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు.