Against BJP Policies | కరీంనగర్ తెలంగాణ చౌక్ ఏప్రిల్ 9: భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ పరిపాలన కొనసాగిస్తున్న కేద్రంలోని బీజేపీ విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా వద్ద గల డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మర్రి వెంకటస్వామి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న జాతులు, సంస్కృతులు,భాషలు, మతాలు కలిసి ఉండాలని ఉద్దేశంతో స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి అనేకమంది యువకులు తమ ప్రాణాలను సైతం దేశం కోసం తృణప్రాయంగా విడిచిపెట్టారని తెలిపారు. అలాంటి అమరవీరుల ఆశయాలకు బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. దేశం లో కులమతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రజల ఐక్యతను విచ్చినం చేయడానికి బిజెపి కుటిలా ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
రాష్ట్రాల హక్కులను హరించేలా గవర్నర్ల తో రాష్ట్రాల పరిపాలనలో జోక్యం చేసుకుంటుందని విమర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణ, ఉత్తర ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తుందని ఆరోపించారు. కేద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను చైతన్యపరిచి ప్రజా ఉద్యమాలు నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి,కిన్నెర మల్లవ్వ, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, మచ్చ రమేష్, బోనగిరి మహేందర్, సాయవేణి రాయమల్లు, కంది రవీందర్ రెడ్డి, నాయకులు కొట్టే అంజలి, మామిడిపెల్లి హేమంత్ కుమార్, సాంబరాజు, నగునూరి రమేష్, భూక్యా శారద, లక్ష్మీ, బీర్ల మంగ, సత్తవ్వ, అరుణ తదితరులు పాల్గొన్నారు.